హైదరాబాద్: హైదరాబాదులో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ హైదరాబాదులో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. 

ఓ పీజీ విద్యార్థికి కరోనా వైరస్ సోకడంతో విద్యార్థులందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తన్నారు. మొత్తం కళాశాలలో 296 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 180 మంది యువతులు కాగా,  116 మంది యువకులు ఉన్నారు.  వీరందరి పరీక్షల నివేదికలు రేపు బుధవారం రానున్నాయి.

హైదరాబాదులో కరోనా వైరస్ విస్తృతమవుతూ వస్తోంది. సోమవారంనాడు తెలంగాణలో 94 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిలో 79 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 2,792 కేసులు నమోదయ్యాయి. 

సోమవారంనాడు కొత్తగా ఆరుగురు కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. దీంతో మరణాల సంఖ్య 88కి చేరుకుంది. సోమవారంనాడు రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్ జిల్లాలో 3, కేసులు నమోదు కాగా నల్లగొండ, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్ జిల్లాలో రెండేసి కేసులు, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. 

ఇదిలావుంటే, హైదరాబాదులోని ఓ బిజెపి నేతకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఆయన కుటుంబంలోని మరొకరికి కూడా కరోనా వైరస్ సోకింది. కరోనా సోకిన ఆ నేత గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.