Asianet News TeluguAsianet News Telugu

బరువు తగ్గేందుకు హాయిగా నిద్రపోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలు మీకోసం..!

World Sleep Day: ప్రశాంతంగా నిద్రపోతే కూడా బరువు తగ్గుతారన్న ముచ్చట బహుషా మీకు తెలిసి ఉండకపోవచ్చు. రాత్రిళ్లు 7  నుంచి 8 గంటలు నిద్రపోతే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

World Sleep Day:   how sleeping better can help in weight loss
Author
First Published Mar 17, 2023, 3:18 PM IST

World Sleep Day: ఈ రోజు ప్రపంచ నిద్ర దినోత్సవం. దీన్ని 2008 నుంచి జరుపుకుంటున్నారు. నిజానికి మనకు నిద్ర అవసరం కాదు అత్యవసరం. అవును కంటినిండా హాయిగా పడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా కంటినిండా నిద్రపోతే ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారంటున్నారు నిపుణులు. 

JAMA ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన యాదృచ్ఛిక క్లినికల్ ట్రయల్ కంటినిండా నిద్రపోతే సులువుగా బరువు తగ్గుతారని వెల్లడిస్తోంది. నిద్ర కూడా ఊబకాయాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

బరువు తగ్గడానికి నిద్ర ఎందుకు ముఖ్యమైనది?

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ బిజీగానే సమయాన్ని గడుపుతున్నారు. విశ్రాంతి కంటే పనికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. నిద్రను కూడా పక్కన పెట్టేస్తున్నారు. అందుకే ప్రస్తుతం చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమికి ఎన్నో కారణాలున్నాయి. కానీ నిద్ర లేమి మీ బరువును పెంచడమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం.. పెద్దలు రాత్రిళ్లు 7 నుంచి 9 గంటల నిద్ర పోవాలి. ఇంతకంటే తక్కువ గంటలు నిద్రపోతే బరువు పెరగడం, జీవక్రియ రుగ్మతలు, ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. 

తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ.. తగినంత నిద్ర లేకపోవడానికి, బరువు పెరగడానికి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. నిద్ర మన మానసిక స్థితి, శక్తి స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడటమే కాకుండా.. బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అసలు నిద్ర బరువును ఎలా తగ్గిస్తుందంటే..

హార్మోన్లను నియంత్రిస్తుంది

ఆకలి, సంతృప్తిని నియంత్రించే గ్రెలిన్,  లెప్టిన్ వంటి హార్మోన్లను నియంత్రించడానికి నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. మీకు తగినంత నిద్ర లేనప్పుడు గ్రెలిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఆకలి పెరగడానికి దారితీస్తుంది. లెప్టిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది మీకు కడుపు నిండిన భావనను తగ్గిస్తుంది. 

ఒత్తిడిని తగ్గిస్తుంది

తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. దీంతో అతిగా తిని బరువు పెరిగిపోతారు. అయితే కంటినిండా నిద్రపోతే మీ ఒత్తిడి స్థాయిలు తగ్గిపోతాయి. దీంతో మీరు అతిగా తినే అవకాశం తగ్గుతుంది.

జీవక్రియను మెరుగుపరుస్తుంది

సరైన జీవక్రియకు నిద్ర చాలా అవసరం. జర్నల్ ఒబెసిటీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నిద్ర లేమి విశ్రాంతి జీవక్రియ రేటు (ఆర్ఎంఆర్) తగ్గడానికి దారితీస్తుంది. మీరు కంటినిండా నిద్రపోనప్పుడు మీ శరీరం జీవక్రియను నియంత్రించే హార్మోన్ ను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది జీవక్రియ తగ్గడానికి, బరువు పెరగడానికి దారితీస్తుంది.

శారీరక శ్రమను పెంచుతుంది

కంటినిండా నిద్రపోతే మీరు రీఫ్రెష్ గా, చురుకుగా ఉంటారు. మీరు బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు.. మీరు శక్తివంతంగా, వ్యాయామం చేయడానికి సిద్దంగా ఉంటారు. క్రమం తప్పకుండా శారీరక శ్రమచేస్తే కేలరీలు బర్న్ అవుతాయి. మీ జీవక్రియ పెరుగుతుంది. బరువు తగ్గుతారు. 

అర్థరాత్రి చిరుతిండిని తగ్గిస్తుంది

నిద్ర లేకపోవడం వల్ల మీరు కేలరీలు,  కొవ్వు ఎక్కువగా ఉండే  ఆహారాలనే తింటారు. ముఖ్యంగా అర్థరాత్రి. రాత్రిళ్లు హాయిగా పడుకోవడానికి అర్థరాత్రి అల్పాహారాన్నే తినండి. అది కూడా లిమిట్ లోనే. 

Follow Us:
Download App:
  • android
  • ios