World Obesity Day: ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే ఊబకాయం వల్ల ప్రెగ్నెన్సీలో ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
World Obesity Day: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 800 మిలియన్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. కానీ స్థూలకాయం వల్ల మధుమేహం, గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థూలకాయలు గర్భధారణ సమయంలో ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు.
ఊబకాయం, గర్భధారణతో సంబంధం ఉన్న సమస్యలు
గర్భధారణ సమయంలో ఎక్కువ బిఎమ్ఐ మీ ఆరోగ్యానికి, మీ బిడ్డ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 30 లేదా అంతకంటే ఎక్కువ బిఎమ్ఐ కలిగి ఉండటాన్ని ఊబకాయంగా నిర్వచిస్తారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం.. 25 నుంచి 29.9 బిఎమ్ఐ ఉన్న మహిళలను అధిక బరువుగా, 18.5 నుంచి 24.9 బిఎమ్ఐ ఆరోగ్యకరమైన, సురక్షితంగా భావిస్తారు. ఒకవేళ మీరు ఊబకాయంతో ఉంటే మీరు గర్భందాల్చడం నుంచి ప్రసవం వరకు ఎన్నో సమస్యలను ఫేస్ చేయొచ్చు. అవేంటంటే..
గర్భధారణ మధుమేహం
ఊబకాయులకు గర్భధారణ సమయంలో.. ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ రకమైన డయాబెటిస్ తల్లీ, బిడ్డల రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. ఇది మాక్రోసోమియా, ముందస్తు ప్రసవం, శ్వాసకోశ వ్యాధులు వంటి సమస్యలకు దారితీస్తుంది.
ప్రీ-ఎక్లంప్సియా
ఊబకాయం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్ స్థాయి ఎక్కువగా ఉండానికి కారణమయ్యే ప్రీ-ఎక్లాంప్సియా అభివృద్ధి చెందే ప్రమాదం కూడా ఉంది. ఇది అకాల జననం, తక్కువ బరువుతో పిల్లల జననంతో పాటుగా ఇది తల్లీ, బిడ్డ కు ఎన్నో ప్రమాదకరమైన సమస్యలను కలిగిస్తుంది.
సిజేరియన్ డెలివరీ
ఊబకాయం సిజేరియన్ డెలివరీ ప్రమాదాన్ని పెంచుతుంది. దీనివల్ల తల్లులు తొందరగా కోలుకోలేరు. సంక్రమణ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. తదుపరి గర్భధారణ సమయంలో సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
గర్భస్రావం, ప్రసవం
స్థూలకాయం గర్భస్రావం, ప్రసవం, పునరావృత గర్భస్రావం ప్రమాదంతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది తల్లులను మానసికంగా, శారీరకంగా సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయం, అధిక రక్తపోటు వల్ల గర్భం పోయే ప్రమాదం ఉంది.
పుట్టుకతో వచ్చే లోపాలు
గర్భధారణ సమయంలో ఊబకాయం.. న్యూరల్ ట్యూబ్ లోపాలు, గుండె లోపాలతో సహా పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది. ఎత్తు, బరువు, పిల్లల ఆరోగ్య స్థితి వంటి వాటిపై ఇది ప్రభావం చూపుతుంది. అందుకే గర్భధారణకు ముందే మీ శరీరం ఆరోగ్యంగా ఉందో? లేదో? ముందుగా తెలుసుకోండి. ఆ తర్వాతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయండి.
