బరువు తగ్గడం అంత సులువైన పనేం కాదని చాలా మంది అనుకుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొంత శ్రద్ధ వహిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు. అయితే కొన్ని తప్పులు చేస్తే మాత్రం మీరు ఏం చేసినా బరువు తగ్గరు. 

బరువు తగ్గడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. కొందరు జిమ్ కు వెళితే.. ఇంకొందరు ఏరోబిక్స్ చేస్తుంటారు. మరికొంతమంది ఆహారాన్ని తగ్గిస్తారు. ఏదేమైనా చేసే పనిని సక్రమంగా చేస్తే మంచి ఫలితాలను సాధించొచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. ఎందుకంటే వీటివల్ల బరువు తగ్గడం అంటూ జరగదు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 1.9 బిలియన్ల మంది సాధారణ బరువు కంటే ఎక్కువ బరువు ఉన్నారు. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కొవ్వు, ప్రోటీన్లు, కార్భోహైడ్రేట్లను తీసుకునే వారు ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే బరువు కూడా తగ్గారు. పలు పరిశోధనల ప్రకారం.. బరువు తగ్గడానికి డాక్టర్లు తక్కువ కొవ్వు లేదా తక్కువ కార్భోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తినాలని సూచిస్తారు. కానీ ఒకే రకమైన ఆహారం ప్రతి వ్యక్తికి సరైంది కాదని పరిశోధనల్లో తేలింది. అయితే బరువు తగ్గేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

శారీరక కార్యకలాపాలకు సమయం కేటాయించకపోవడం

ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. జిమ్ కు వెళ్లడం ఇష్టం లేకపోతే రెగ్యులర్ గా వాకింగ్ కు వెళ్లండి. జస్ట్ కొన్ని నిమిషాల నడక మీ శరీర స్టామినాను పెంచుతుంది. నడకతో పాటు జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ కూడా చేయండి. వాకింగ్ మీ ఒత్తిడిని ఇట్టే తగ్గిస్తుంది. అలాగే మీరు వేగంగా బరువు తగ్గుతారు. నడక కణాలకు ఆక్సిజన్ బాగా అందేందుకు సహాయపడుతుంది. ఇది కణాల మరమ్మత్తును మెరుగుపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

సరైన ఆహారాలను తినకపోవడం

మీరు ఎప్పుడు తింటున్నారు? ఏం తింటున్నారో కూడా ముఖ్యం. మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉండాలి. అలాగే మీ భోజనంలో జింక్, ఇనుము, పొటాషియం, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉండాలి. పోషకాహార నిపుణుడి సలహాతో మీరు తినే ఆహారాన్ని ప్లాన్ చేసుకోండి. సమయానికి తినండి. దీనివల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలంటే మీరు ఆహారాన్ని బాగా నమిలి తినాలి. 

కొవ్వులను పూర్తిగా మానేయడం

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఇతర మంచి కొవ్వులు మన ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే ఇవి మీరు తినే ఆహారంలో ఉండేట్టు చూసుకోండి. ఇందుకోసం రోజువారీ ఆహారంలో గుమ్మడి కాయ, లిన్ సీడ్ తో సహా చేపలు, గింజలు, ఇతర రకాల విత్తనాలను చేర్చండి. అలాగే మీరు తినే వంటలో రకరకాల హెల్తీ నూనెలను పరిమితిలో వాడండి. 

నీటిని తక్కువగా తాగడం

మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుకోవాలంటే నీటిని పుష్కలంగా తాగాలి. క్రమం తప్పకుండా రోజుకు 9 గ్లాసుల నీటిని తాగడం అలవాటు చేసుకోండి. తినేటప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్లను తాగకండి. అలాగే తినడానికి 30 నిమిషాల ముందే నీటిని తాగాలి. ఈ అలవాట్ల వల్ల మూడు నెలల్లో 44 శాతం బరువు తగ్గవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి భోజనానికి ముందు నీళ్లను తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఎందుకంటే అప్పటికే కడుపు నిండిపోతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు నిమ్మరసం, గ్రీన్ టీ ని తీసుకోవాలి.