మన శరీరంలోని ప్రతి అవయవం దాని విధులను సక్రమంగా నిర్వర్తిస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఏ అవయవానికి ఏ చిన్న సమస్య వచ్చినా.. మన శరీరం ఎన్నో హెచ్చరిక సంకేతాలను చెబుతుంది. కీడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే కూడా ఇలాగే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మన శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలంటే అవయవాలన్నీ సక్రమంగా విధులను నిర్వర్తించాలి. మన గుండె, మెదడు, ఊపిరితిత్తుల మాదిగానే మన మూత్రపిండాలు కూడా సక్రమంగా పనిచేయాలి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. మూత్రపిండాలు మన శరీరంలో విషయాన్ని బయటకు పంపుతాయి. అలాగే వ్యర్థాలను మూత్రంగా మార్చుతాయని యూకే నేషనల్ హెల్త్ సర్వేసెస్ వివరిస్తుంది. అయితే మీ మూత్రపిండాలు దెబ్బతింటే మన శరీరంలో కొన్ని లక్షణాలను వెల్లడిస్తుంది. వాటిని గమనించి హాస్పటల్ కు వెళితే సమస్య తొందరగా తగ్గిపోతుంది. లేదంటే మీ మూత్రపిండాల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంది.
ముఖం, పాదాలలో వాపు, కళ్ల చుట్టూ ఉబ్బడం
మన మూత్రపిండాల ప్రధాన విధి విషాన్ని, వ్యర్థాలను బయటకు పంపడం. అయితే మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడం ఆపేస్తే ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా మీ శరీర కణజాలాలో అదనపు నీరు, ఉప్పు చేరుతుంది. దీంతో పాటుగా ట్యాక్సిన్స్, మలినాలు ఏర్పడతాయి. దీనివల్ల మీ ముఖం, పాదాల్లో వాపు వస్తుంది. అంతేకాదు కళ్ల చుట్టూ వాపు వస్తుంది.
విపరీతమైన అలసట
మూత్రపిండాలు ఎర్ర రక్తకణాలను కూడా ఏర్పరుస్తాయి. ఈ ఎర్రరక్తకణాలు లోపిస్తే రక్తహీనత సమస్య వస్తుంది. ఇది మెదడు, కండరాలకు శరీరంలోని ఆక్సిజన్, పోషకాల సరఫరాలకు అంతరాయం కలిగిస్తుంది. దీంతో మీరు విపరీతంగా అలసిపోతారు.
మూత్రవిసర్జనలో మార్పులు
మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మూత్ర విసర్జనలో మార్పులు వస్తాయి. సాధారణంగా మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి, రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి సహాయపడతాయి. దీని ద్వారే మన శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. అయితే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు మూత్రవిసర్జనలో మార్పులు వస్తాయి. అంటే తరచుగా మూత్రం రావడం, మూత్రంలో రక్తం రావడం, మూత్రంలో నురగ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
మన శరీరంలోని ద్రవాన్ని సమతుల్యం చేయడానికి మన మూత్రపిండాలు బాధ్యత వహిస్తాయి. అయితే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఊపిరితిత్తులల్లో ద్రవం పేరుకుపోతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. దీనిని ఫ్లూయిడ్ ఓవర్ లోడ్ లేదా హైపర్వోలేమియా అని కూడా అంటారు. అయితే కొంతమందికి ఛాతిలో నొప్పి కూడా కలుగుతుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
దురద
డ్రై స్కిన్, దురద కూడా మూత్రపిండాల వ్యాధికి సంకేతం. ఇది రక్తంలో ఖనిజాలు, పోషకాల అసమతుల్యతను సూచిస్తుంది. రక్తంలో భాస్వరం స్థాయిలు అకస్మత్తుగా పెరగడం వల్ల ఇలా జరుగుతుంది.
