విటమిన్ డి లోపంతో క్యాన్సర్ .. సేఫ్ గా ఉండాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..!
మన శరీరానికి విటమిన్ డి చాలా చాలా అవసరం. ఇది మన ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుందని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ ఇది లోపిస్తే క్యాన్సర్ వస్తుందన్న సంగతి చాలా మందికి తెలియదు. అవును ఎవరి శరీరంలో అయితే విటమిన్ డి లోపిస్తుందో వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. సాధారణంగా ఈ విటమిన్ డి లోపం 65 ఏళ్లు పైబడిన వారినే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కానీ ఈ పోషక లోపం ఏ వయసు వారికైనా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మీకు తెలుసా? ఈ విటమిన్ డి లోపం ప్రపంచ జనాభాలో 13 శాతం మందిని ప్రభావితం చేస్తుందని అంచనా. ఈ విటమిన్ డి లోపం వల్ల ఎముకల బలం తగ్గుతుంది. అలాగే ఎముకల వ్యాధులు వస్తాయన్న ముచ్చట ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ తాజా అధ్యయనాలు మాత్రం ఈ విటమిన్ డి లోపం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని తేల్చి చెప్పేశాయి. తాజా అధ్యయనాల ప్రకారం.. ఈ విటమిన్ లోపం అండాశయం, రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్ తో పాటుగా ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే ఒక ముఖ్యమైన విటమిన్. ఈ పోషకం మన శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన కాల్షియాన్ని గ్రహించడానికి బాగా సహాయపడుతుంది. మన శరీరంలో ఈ పోషకం లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు వస్తాయి. అలాగే కండరాల తిమ్మిరి, మూడ్ స్వింగ్స్, అలసట వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.
విటమిన్ డి లోపం క్యాన్సర్ కు ఎలా దారితీస్తుంది?
రుతువిరతి తర్వాత హెల్తీగా ఉన్న మహిళలు విటమిన్ డి 3, కాల్షియం తీసుకోవడం వల్ల వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. విటమిన్ డి లోపం వల్ల కడుపు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ తో సహా ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్యాన్సర్ కణాలు ఫాస్ట్ గా పెరగడాన్ని నివారించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంతో క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గుతుంది. అలాగే ఇది క్యాన్సర్ వ్యాప్తిని,కొత్త కణాల పెరుగుదలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఎంఎంఆర్ అనే ప్రక్రియ ద్వారా ఏర్పడిన జన్యువులను మరమ్మతు చేసే ప్రక్రియలో కూడా సహాయపడుతుంది. ఇది సరిగ్గా పనిచేయడానికి విటమిన్ డి క్రియాశీల రూపం అవసరమని వైద్యులు అంటున్నారు.
విటమిన్ డి స్థాయిలను సహజంగా ఎలా పెంచాలి?
సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. అందుకే రోజూ కాసేపు ఉదయం ఎండలో కూర్చోవాలి. అలాగే పుట్టగొడుగులను తిన్నా కూడా విటమిన్ డి అందుతుంది. అలాగే చేపలతో పాటుగా సీఫుడ్స్ లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అలాగే గుడ్డు పచ్చసొన కూడా విటమిన్ డి కి మంచి వనరు. అలాగే ఆవు పాలు, నారింజ రసం, తృణధాన్యాలు, పెరుగు వంటి బలవర్థకమైన ఆహారాల్లో కూడా విటమిన్ డి మెండుగా ఉంటుంది.