మైగ్రేన్ నొప్పిని మాటల్లో వివరించలేం. చిన్న శబ్దం విన్నా ఈ నొప్పి ఎక్కువవుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
తలనొప్పి రానివారు అసలే ఉండరేమో. నిజానికి తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీనికి తరచుగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం. అయితే ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పి తగ్గిపోతుంది. ఇకపోతే మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ నొప్పి భరించలేని విధంగా వస్తుంది. నిద్ర రుగ్మతలలో ఇదీ ఒకటి. కాంతిని చూడలేకపోవడం, పెద్ద పెద్ద శబ్దాలను వినలేకపోవడం, వాంతులు మైగ్రేన్ ప్రధాన లక్షణాలు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ మైగ్రేన్ నొప్పిని తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
శబ్దాలకు దూరంగా..
పెద్ద పెద్ద శబ్దాలను విన్నప్పుడు కొంతమంది విపరీతమైన మైగ్రేన్ నొప్పి వస్తుంది. అందుకే ఇలాంటి వారు శబ్దాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన ప్రదేశంలో కాసేపు ఒంటరిగా కూర్చుంటే ఈ నొప్పి వచ్చే అవకాశం ఉండదు. అలాగే నొప్పి ఉన్నా కొద్దిసేపటికి తగ్గిపోతుంది.
మొబైల్ ఫోన్లకు దూరం
మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లను, ల్యాప్ టాప్ లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది. అందుకే వీటి వాడకాన్ని చాలా వరకు తగ్గించాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో.. చీకటిలో ఫోన్ వాడే అలవాటున్న వారికి మైగ్రేన్ నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఒత్తిడి
ఒత్తిడి, టెన్షన్, దూర ప్రయాణాలు, ఎండకు ఉండటం వల్ల చాలా మందికి మైగ్రేన్ నొప్పి వస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఇలాంటివాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని ఆహారాలు
కొంతమందికి కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల కూడా మైగ్రేన్ సమస్య రావొచ్చు. ముఖ్యంగా చాక్లెట్స్, కెఫిన్, వైన్ వంటి కొన్ని ఆహారాలను తినడం వల్ల మైగ్రేన్ నొప్పి వస్తుంది. అందుకే వీరు తలనొప్పికి కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
ఏసీ..
కొంతమందికి ఏసీలో కూర్చుంటే కూడా తలనొప్పి వస్తుంది. ఈ సమస్య మీకు ఉంటే ఏసీలో ఎక్కువ సేపు ఉండకండి.
ఆల్కహాల్
ఆల్కహాల్ ను తాగితే కూడా చాలా మంది అపుడప్పుడు తలనొప్పి వస్తుంది. అందుకే మైగ్రేన్ సమస్య ఉన్నవారు మద్యపానానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్
శరీరంలో తగినంత వాటర్ కంటెంట్ లేకుండా బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. మైగ్రేన్ నొప్పి రాకూడదంటే నీళ్లను పుష్కలంగా తాగాలి.
యోగా
యోగా చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును పునరుత్తేజపరచడానికి సహాయపడుతుంది. అందుకే మీరు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కాసేపు యోగా లేదా, వ్యాయామం చేయండి.
లావెండర్ ఆయిల్
లావెండర్ ఆయిల్ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకోసం టిష్యూ పేపర్ పై కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ పోసి దాని వాసనను పీల్చుకోవాలి.
అల్లం
అల్లం కూడా తలనొప్పిని ఇట్టే తగ్గిస్తుంది. వాంతులు వంటి సమస్యలను తగ్గించడానికి అల్లం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం అల్లం రసం, నిమ్మరసాన్ని కలిపి రోజుకు రెండుసార్లు తాగండి. నుదిటిపై ఐస్ ఉన్న ప్లాస్టిక్ ప్యాక్ ను పెట్టినా తలనొప్పి తగ్గిపోతుంది. ఇది నుదిటికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
