పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు.. ఇలా ఒత్తిడి కలగడానికి కారణాలెన్నో ఉన్నాయి. ఏదేమైనా దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోకపోతే ఎన్నో మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సర్వ సాధారణ సమస్యల్లో 'ఒత్తిడి' ఒకటిగా మారిపోయింది. ముఖ్యంగా ఈ బిజీ లైఫ్ లో చాలా మంది స్ట్రెస్ తో బాధపడుతున్నారు. ఒత్తిడికి ఎన్నో కారణాలున్నాయి. కారణమేదైనా దీన్నుంచి వీలైనంత తొందరగా బయటపడాలి. లేకపోతే ఎన్నో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒకవేళ మీరెన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకపోతే సైకాలజిస్టును సంప్రదించాలి. అయితే కొన్ని రకాల పండ్లలో ఒత్తిడి తగ్గించే సామర్థ్యం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటంటే..
బ్లూబెర్రీలు
బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు బ్లూబెర్రీలను తినడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మధుమేహం నుంచి రక్షిస్తాయి.
అరటిపండ్లు
అరటిపండ్లు సీజన్లతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటాయి. ఇవి చవకైన పండ్లు కూడా. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపర్చడానికి అరటిపండ్లు ఎంతో సహాయపడతాయి. ఈ పండులోని పోషకాలు మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ అరటి పండును తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
నారింజ
నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది మన శరీరంలో ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడి ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి.
పుచ్చకాయ
పుచ్చకాయలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ అనేక రోగాలకు దివ్యౌషధం అని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటును తగ్గించడానికి పుచ్చకాయ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 99 శాతం నీరు ఉండే పుచ్చకాయ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
కివీ
కివీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. కివీని క్రమం తప్పకుండా తినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రిళ్లు ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపడుతుంది. ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.
అవోకాడో
అవొకాడోలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవొకాడోల్లో ఉండే విటమిన్ బి, విటమిన్ ఇ లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
