గర్బిణులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. అందులో నడక ఒకటి. అవును గర్భిణులు రోజూ కొద్ది సేపు నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
గర్భధారణ సమయంలో వ్యాయామం చాలా చాలా అవసరం. అయితే గర్భిణులు వ్యాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఎందుకంటే గర్భిణులు కష్టమైన వ్యాయామాలను చేస్తే బిడ్డకు తకు ప్రమాదం జరగొచ్చు. గర్భిణులు క్రీడలు లేదా భారీ వెయిట్ లిఫ్టింగ్ లేదా చాలా కఠినమైన వ్యాయామాలను అస్సలు చేయకూడదు. ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో.. డెలివరీ తర్వాత కూడా. గర్భధారణ ప్రారంభంలో మహిళలు చేయగలిగే ఏకైక వ్యాయామం నడక. అవును చురుకుగా ఉండటానికి, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నడక ఒక గొప్ప మార్గం. ఎందుకంటే ఇది తక్కువ ప్రభావ ఏరోబిక్ వ్యాయామం వంటిది. నడక మీ శరీరాన్ని ఒత్తిడికి గురిచేయదు. మూడో త్రైమాసికంలో గర్భిణులు దీన్ని సులభంగా చేయొచ్చు. అయితే గర్బిణులు నడుస్తున్నప్పుడు మాట్లాడగలగాలి. అలాగే సులువుగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తే వెంటనే నడవడం ఆపాలి. గర్భిణులు నడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భిణులు రోజూ కొద్ది సేపు నడవడం వల్ల హృదయనాళ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నడక గర్భిణుల స్టామినాను మెరుగుపరుస్తుంది. అలాగే మీరు ప్రెగ్నెన్సీ మొత్తం చురుగ్గా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఇది మీ బరువు పెరగడాన్ని నియంత్రణలో ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలకు. ప్రతి భోజనం తర్వాత కాసేపు నడిస్తే బరువు అదుపులో ఉంటుంది. నడక కేలరీలను బర్న్ చేస్తుంది.
నడక జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. తిన్న తర్వాత కడపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది.
నడక మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది. కాబ్టటి ఇది ప్రేగు కదలికకు కూడా సహాయపడుతుంది. ఎందుకంటే గర్భధారణలో మలబద్దకం సర్వ సాధారణ సమస్య. కాబట్టి తిన్న తర్వాత కొద్ది సేపు నడిస్తే ఆహార కదలిక మెరుగుపడుతుంది.
వ్యాయామం, నడక కూడా మూడ్ ఎలివేటర్లు. కాబట్టి ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేయడానికి కూడా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో మీరు మరింత సానుకూలంగా ఉంటారు. ఇది మీ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
నడక మీ శరీరాన్ని శ్రమకు సిద్ధం చేస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో నిరంతరం నడిచేవారికి నార్మల్ డెలివరీకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ శరీరం, కండరాలు ప్రసవానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఇది మీ కటి కండరాలను బలోపేతం చేస్తుంది. ప్రసవానికి మీ శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
