Mother's Day 2023: మదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకోవడమంటే తల్లులకు విషెస్ చెప్పడం, గిఫ్ట్ లు ఇవ్వడం, కమ్మని వంటలు చేసిపెట్టడమే కాదు అమ్మ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. ఒక వయసు వచ్చిన ఆడవారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని ముందే గుర్తిస్తే ఆరోగ్యంగా ఉంటారు.
గర్భాశయ క్యాన్సర్
ఆసియాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు భారత్ లోనే ఎక్కువగా ఉన్నాయి. తర్వాతి స్థానంలో చైనా ఉందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరణాల్లో 23 శాతం భారత్ నుంచే నమోదవుతున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 6,04,127 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే దీనిలో 3,41,831 మంది చనిపోయారు. అయితే ఈ కేసులను తగ్గించడానికి ఈ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. పాప్ స్మియర్ అని పిలువబడే సాధారణ పరీక్ష గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించడానికి సహాయపడుతుంది. 35 ఏళ్ల తర్వాత రెగ్యులర్ గా పాప్ స్మియర్ తీసుకోవడం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
రొమ్ము క్యాన్సర్
గత దశాబ్దకాలంలో భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చిన్న వయస్సు వారు కూడా దీని బారిన పడుతున్నారు. రొమ్ము స్క్రీనిం, సోనోమామోగ్రఫీ వంటి పరీక్షలతో దీన్ని గుర్తించొచ్చు. గ్లోబోకాన్ 2020 అధ్యయనం ప్రకారం.. ప్రతి నాలుగు నిమిషాలకు ఒక భారతీయ మహిళకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది. ఇది మహిళల్లో అత్యంత సాధారణ రకం క్యాన్సర్. ప్రతి సంవత్సరం సుమారు 1.78 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.
పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్
పునరుత్పత్తి వయస్సులో కొంతమంది మహిళలు పీసీఓఎస్ అని పిలువబడే హార్మోన్ల రుగ్మత బారిన పడుతున్నారు. దీనిబారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ జీవనశైలి మార్పులతో పీసీఓఎస్ ను నిర్వహించొచ్చు. దీని గురించి అవగాహన పెంచడానికి తగినంత శ్రద్ధ అవసరం. భారతీయ మహిళల్లో 20% మంది దీనితో బాధపడుతున్నారని అంచనా. దీన్ని సకాలంలో గుర్తించకపోతే వీరి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. క్రమరహిత పీరియడ్స్, హిర్సుటిజం, స్థూలకాయం వంటి సంకేతాలు చిన్నవారిలో కనిపిస్తాయి. పెద్దవారిలో వంధ్యత్వం, గర్భస్రావాలు మొదలైనవి లక్షణాలు కనిపిస్తాయి.
సంతానలేమి
యువతులలో ఆందోళన కలిగించే సాధారణ కారణాలలో ఇదీ ఒకటి. పీసీఓఎస్ వంధ్యత్వానికి దారితీస్తుంది. వంధ్యత్వానికి కారణం ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, వాతావరణ కాలుష్యం, లేట్ గా పెళ్లిళ్లు చేసుకోవడం.
గుండె జబ్బులు
రుతువిరతి తర్వాత గుండె జబ్బుల ప్రమాదం బాగా పెరుగుతుంది. ఇండియాలో గుండెజబ్బుల కారణంగా ఏటా కోటి మంది చనిపోతున్నారు. మృతుల్లో 20.3 శాతం మంది పురుషులు కాగా, 16.9 శాతం మంది మహిళలు ఉన్నారు. అందుకే మహిళలు గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ప్రతి సంవత్సరం పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. కొరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే మహిళలకు భిన్నంగా ఉంటాయి.
బోలు ఎముకల వ్యాధి
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. రుతువిరతి ఆగిపోయిన మహిళల్లో 30% మందికి బోలు ఎముకల వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారతదేశంలో ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. బోలు ఎముకల వ్యాధి ప్రపంచవ్యాప్తంగా కనిపించే రెండవ అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఎముక సాంద్రతకు ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ అవసరం. అయితే 35 సంవత్సరాల తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఎముకలు క్షీణించేలా చేస్తుంది.
