మన శరీరానికి విటమిన్లు చాలా చాలా అవసరం. ఇవి లోపిస్తేనే లేని పోని రోగాలు వస్తాయి. ముఖ్యంగా శరీరం బలహీనంగా మారుతుంది. అలాగే..  

మన శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఎన్నో రకాల విటమిన్లను తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా విటమిన్లు ఆహారం ద్వారే అందుతాయి. మనం తింటున్న ఆహారంలో పోషకాలు లోపించే అవకాశం లేకపోలేదు. కానీ మన శరీరంలో పోషకాలు లోపిస్తే మాత్రం శరీరం బలహీనంగా మారుతుంది. అలాగే ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటారు. 

నిజానికి మన దేశంలో ఎంతోమంది పోషకాల లోపంతో బాధపడుతున్నారు. ఈ పోషకాల లోపం ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కొంతమంది ఆరోగ్యంగానే కనిపించిన అంతర్గతంగా బలహీనంగా ఉండటమే కాకుండా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

విటమిన్ల లోపం వల్ల వచ్చే సమస్యలు

మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరమవుతాయి. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మనల్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. ఇవి మన శరీరంలో లోపిస్తే శరీరం బలహీనపడుతుంది. ఎముకల బలం తగ్గుతుంది. బోలు ఎముకల వ్యాధి రావొచ్చు. ఎముక పగుళ్లు ఏర్పడొచ్చు. కండరాల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాదు చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. విటమిన్ లోపం పొడి చర్మానికి దారితీస్తుంది. స్కిన్ వదులుగా అవుతుంది. అలాగే వెంట్రుకలు కూడా బలహీనంగా అయ్యి విపరీతంగా రాలిపోతాయి. 

ఎవరికి విటమిన్లు ఎక్కువ అవసరం? 

విటమిన్లు ప్రతి ఒక్కరికీ అవసరమే. అయితే ఈ విటమిన్ల లోపం ఎక్కువగా వృద్ధులు, గర్భిణుల్లోనే కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు మందులను వేసుకుంటే కూడా పోషకాల లోపం ఏర్పడొచ్చు. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారం తిన్న యువతలో కూడా పోషకాల లోపం ఉంటుంది. వీళ్లకు విటమిన్ల లోపంతో పాటుగా ఇతర పోషకాల లోపం కూడా ఉంటుంది. 

ఒకవేళ మీ శరీరంలో పోషకాల లోపం ఉంటే.. ఈ సమస్య నుంచి బయటపడటానికి మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకోండి. వీటివల్ల విటమిన్ల లోపం పోవడమే కాదు సెలీనియం, జింక్, మెగ్నీషియం, క్రోమియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ కూడా మీ శరీరానికి అందుతాయి. 

మల్టీ విటమిన్ల ప్రయోజనాలు

మల్టీవిటమిన్లను తీసుకోవడం వల్ల మీ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు మీ శరీరానికి అవసరమైన శక్తి కూడా అందుతుంది. ఈ మల్టీవిటమిన్లు శరీరం, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చేతులు, కాళ్లు, ఒంటి నొప్పులు ఉంటే మల్టీ విటమిన్లను తీసుకోండి. ఇవి ఈ నొప్పులను ఇట్టే తగ్గిస్తాయి.