అతిగా మద్యం సేవిస్తే... అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అందరికీ తెలుసు. లివర్ డ్యామేజ్ అవుతుందని కూడా తెలుసు. ఇతర అనారోగ్య సమసల్యు వస్తాయని కూడా తెలుసు కానీ.. వాటిని తాగడం మానేయరు. ఎందుకు అంటే... నేను తాగితే  నా ఒక్కడికే గా నష్టం. మరొకరికి ఏమీ కాదుకదా అని అంటూ ఉంటారు. అయితే... టోటల్ డీఎన్ఏ కే నష్టం చేకూరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అతిగా, అదే పనిగా మద్యం తాగే వ్యక్తులపై ఓ పరిశోధన నిర్వహించారు. మద్యం తాగినపుడు వారిలో జన్యువులు, మెదడు ఎలా స్పందిస్తోందో పరిశీలించారు. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 

అతిగా ఆల్కహాల్ తాగేవారిలో డీఎన్ఏకు ఆల్కహాల్ కారణంగా గణనీయమైన నష్టం జరిగిందని గుర్తించారు. ఆల్కహాల్ కారణంగా ప్రభావితమైన రెండు జన్యువులు విపరీతంగా ప్రవర్తించడాన్ని వారు గుర్తించారు. ఈ రెండు జన్యువులు జీవక్రియల్లో జరిగే మార్పులు, ఒత్తిడిలో శరీర స్పందన తీరును నియంత్రించడాన్ని గుర్తించారు.

ఈ నష్టం ఇక్కడితో ఆగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు."ఈ దెబ్బతిన్న జన్యువులు ఆ వ్యక్తులను మరింత ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేలా చేస్తాయి. ఒత్తిడిలోకి నెట్టి, మద్యం లేకపోతే ఉండలేని స్థితికి వారిని తీసుకెళ్తాయి" అని వారంటున్నారు.

అంటే, ఎంత ఎక్కువ ఆల్కహాల్ మన శరీరంలోకి వెళ్తే, అంత ఎక్కువ నష్టం అన్నమాట. మద్యం సేవించేవారిలో జన్యువులకు నష్టం జరగడానికి ఎంత అవకాశముందో... తెలుసుకునే దిశగా ఈ ఫలితాలు తోడ్పడవచ్చు.