పీరియడ్స్ నొప్పిని మాటల్లో చెప్పలేం. ఈ బాధ బయటికి కనిపించనిది. కానీ దీనివల్ల ఏ పనీ చేయలేం. అయితే కొన్ని చిట్కాలు ఈ నొప్పి నుంచి కాస్త ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయి. అవేంటంటే..
పీరియడ్స్ ఒక సహజ ప్రక్రియ. అలాగే పీరియడ్స్ లో వచ్చే నొప్పి ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం. ఈ నొప్పి భరించలేనంతగా ఉంటుంది. అలా అని ప్రతి ఒక్క స్త్రీకి ఇలా అవుతుందని చెప్పలేం. ఒక్కొక్కరికీ ఒక్కోలా నెలసరి సమస్యలు వస్తాయి. ఈ నెలసరి నొప్పి వల్ల రోజువారీ పనులను కూడా చేసుకోలేరు. అయినప్పటికీ కడుపు నొప్పి, తిమ్మిరిని తగ్గించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..
వ్యాయామం
ప్రతి రోజూ వ్యాయామం చేస్తే మన శరీరం ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి సహజ నొప్పి నివారణలుగా పనిచేస్తాయి. అలాగే తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడతాయి. రన్నింగ్, జాగింగ్, యోగా చేయడం లేదా ఏదైనా శరీరక వ్యాయామాన్ని చేయండి. ఇవి రుతుస్రావ తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పీరియడ్ సమస్యలు తగ్గిపోతాయి.
హీటింగ్ ప్యాడ్
వేడి నీటి బాటిల్ లేదా హీట్ ప్యాడ్ పీరియడ్స్ తిమ్మిరిని, నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఇవి రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి. కండరాలను సడలించడానికి, తిమ్మిరిని తగ్గించడానికి హీటింగ్ ప్యాడ్ సహాయపడుతుంది. అయితే ఇది మరీ ఎక్కువగా వేడి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే చర్మం కాలిపోయేలా చేస్తుంది.
నొప్పి నివారణా మందులు
నొప్పిని తగ్గించే మందులు తీసుకుంటే కూడా రుతుక్రమ తిమ్మిరి వదిలిపోతుంది. అలాగే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇబుప్రోఫెన్ వంటి నాన్స్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఎఐడి) మంటను తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా లభిస్తాయి. వీటి వాడకం వల్ల నష్టాలేమీ ఉండవు. అయినప్పటి లేబుల్లోని మోతాదులోనే వీటిని తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడం మంచిది కాదు.
చామంతి టీ
ఇది కండరాలను సడలించడానికి, తిమ్మిరిని తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అల్లం, పసుపు వంటి మూలికలు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
