అధిక రక్తపోటు చిన్న సమస్యగా కనిపించినా.. ఇది సులువుగా ప్రాణాలను తీసేస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.  

అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని కూడా ఉంటారు. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్, ధమనులలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఒత్తిడి, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు రక్తపోటును పెంచుతాయి. దీన్ని సకాలంలో గుర్తించకపోయినా, చికిత్స తీసుకోకపోయినా హైబీపీ ప్రమాదకరంగా మారుతుంది. రక్తపోటును నియంత్రించడానికి ఆహార మార్పులు అవసరమంటున్నారు నిపుణులు. అధిక రక్తపోటును నియంత్రించడానికి ఎలాంటి పానీయాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అరటిపండు జ్యూస్

అరటి పండ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక మీడియం సైజు అరటిపండులో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. ఈ జ్యూస్ లను తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

టమాటో జ్యూస్

టమోటాల్లో కూడా ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది హై బీపీని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 100 గ్రాముల టమోటాల్లో 237 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. కాబట్టి టమోటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగండి. ఇది మీ రక్తపోటును నియంత్రిస్తుంది. 

క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ కూడా అధిక రక్తపోటు పేషెంట్లకు మంచి మేలు చేస్తుంది. క్యారెట్లు పొటాషియం అధికంగా ఉండే కూరగాయ. కాబట్టి క్యారెట్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటును కంట్రోల్ చేసుకోవచ్చు.

దానిమ్మ రసం

దానిమ్మ రసం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దానిమ్మ బీపీని నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

అవొకాడో జ్యూస్

అవొకాడోల్లో పొటాషియం, ఫోలేట్ లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి అవొకాడో జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. 

బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ లో నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి బీట్ రూట్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. 

స్ట్రాబెర్రీ జ్యూస్

స్ట్రాబెర్రీ జ్యూస్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కూడా.