కొంతమంది ఎప్పుడూ చూసినా తింటూ ఉంటారు. ఇలాంటి వారే చాలా ఫాస్ట్ గా బరువు పెరిగిపోతారు. ఇలా అతిగా తినాలనిపించడానికి కారణం మీలో ప్రోటీన్ లోపమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.  

సమయానికి తిన్నా.. మధ్యమధ్యలో తినాలనిపిస్తుంది. అదికూడా ఆరోగ్యాన్ని పాడే చేసే వాటినే. ఇలా అనిపించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ..దీనికి ప్రధాన కారణం మాత్రం ప్రోటీన్ల లోపమేనంటున్నారు నిపుణులు. మీ శరీరానికి సరైన పోషణ అందిస్తే ఈ సమస్య నుంచి సులవుగా బయటపడొచ్చు. ఆకలి కోరికలను, అతిగా తినడాన్ని నియంత్రించగలుగుతారు. కానీ ప్రోటీన్ లోపం మీరు అతిగా తినేలా చేస్తుంది. దీంతో మీరు బరువు బాగా పెరిగిపోతారు. 

ప్రోటీన్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు బరువు పెరగడానికి కారణమవుతాయని చాలా మంది అనుకుంటారు. నిజానికి అవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఎలాగంటే..? ప్రోటీన్ ఎన్నో సంతృప్తి హార్మోన్లను పెంచుతుంది. ఆకలి హార్మోన్ ను తగ్గిస్తుంది. దీంతో మీరు అతిగా తినరు. ఎందుకంటే ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాగా మీరు తగినంత ప్రోటీన్ ను తీసుకోకపోతే ఆకలి పెరుగుతుంది. బరువు పెరుగుతుంది. అలాగే ఊబకాయం బారిన పడతారు. 

అతిగా తినడం, ఊబకాయం వెనుక ప్రోటీన్ లోపం ఉందని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కనుగొన్నారు. శరీరంలో ప్రోటీన్ లేకపోవడం ఆకలిని ప్రేరేపిస్తుందని, అతిగా తినడానికి దారితీస్తుందని అధ్యయనం సూచిస్తుంది. అంతేకాదు దీనివల్ల మీరు అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలనే ఎక్కువగా తింటారు. మరి ప్రోటీన్ లోపం పోవాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినండి

మీరు తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే వాటినే చేర్చండి. గుడ్లు, చేపలు, పౌల్ట్రీ, టర్కీ, ఇతర మాంసాలు వంటి ఆహారాలు ప్రోటీన్లకు మంచి వనరు. ఒక వేళ మీరు శాకాహారి అయితే బీన్స్, టోఫు, సోయాబీన్స్, కాయధాన్యాలు, బాదం, పచ్చి బఠానీలు, గుమ్మడికాయ విత్తనాలను తినండి. అవన్నీ ప్రోటీన్ కు గొప్ప వనరులు. 

హెల్తీ స్నాక్స్ 

బాదం, జున్ను, గ్రీకు పెరుగు వంటి ఆహారాన్ని స్నాక్స్ చేసి తింటే మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. ఇవి మీ ఆకలిని కూడా నియంత్రణలో ఉంచుతాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్ ను పుష్కలంగా తింటే బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుంది. 

ప్రోటీన్ పౌడర్

ప్రోటీన్ పౌడర్ మొక్కల ఆధారిత, జంతు ఆధారిత రూపాల్లో లభిస్తుంది. మీ ప్రోటీన్ వినియోగాన్ని పెంచడానికి ప్రోటీన్ పౌడర్ ను స్మూతీలు లేదా తృణధాన్యాలలో కలపండి. తాగడానికి ముందు ప్రోటీన్ పౌడర్ ను చల్లటి నీరు, పాలతో కలిపి తాగితే పోషకాలు ఎక్కువ లభిస్తాయి. 

ప్రోటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం

గుడ్లు లేదా గ్రీకు పెరుగు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తింటే ఆ రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతేకాదు ఈ ఆహారాలు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి.