సదరు దాతకు హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్(హెచ్‌ఎల్)తో పాటు, సహజ హెచ్‌ఐవీ నిరోధకంగా పేర్కొనే సీసీఆర్5-డెల్టా 32 మ్యుటేటెడ్ జన్యువు కూడా ఉండాలి.
క్యాన్సర్ తో పాటు.. హెచ్ఐవీతో బాధపడుతున్న ఓ మహిళకు.. ఒకే ఒక్క చికిత్స తో.. రెండింటి నుంచి విముక్తి లభించింది. ‘హ్యాప్లో కార్డ్ ట్రాన్స్‌ప్లాంట్’ అనే అత్యంత అధునాతన మూలకణ మార్పిడి చికిత్స చేయడంతో ఆమె శరీరంలో హెచ్‌ఐవీ ఆనవాళ్లే లేకుండా పోయాయి
మూలకణ చికిత్స ద్వారా హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందిన మూడో పేషెంట్, తొలి మహిళ ఆమె. న్యూయార్క్‌లోని ప్రెస్బిటేరియన్ వెయిల్ కార్నెల్ మెడికల్ సెంటర్ వైద్యులు సాధించిన ఘనత ఇది. ‘న్యూయార్క్ పేషెంట్’గా పేర్కొంటున్న ఆ మహిళకు(64) 2013లో హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత ఆమె ఎక్యూట్ మైలాయిడ్ లుకేమియా(మూలుగలో రక్తకణాలను తయారుచేసే కణాల్లో వచ్చే కేన్సర్) బారిన పడింది.
దీంతో ఈ రెండింటికీ చికిత్స చేయడానికి అవసరమైన మూలకణాలు గల దాత కోసం వైద్యులు ఎదురుచూశారు. సదరు దాతకు హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్(హెచ్‌ఎల్)తో పాటు, సహజ హెచ్‌ఐవీ నిరోధకంగా పేర్కొనే సీసీఆర్5-డెల్టా 32 మ్యుటేటెడ్ జన్యువు కూడా ఉండాలి. ఈ మ్యుటేటెడ్ జన్యువు చాలావరకూ ఉత్తర యూరోపియన్ మూలాలున్నవారిలో మాత్రమే ఉంటుంది.
అలాంటి దాత దొరకగానే వైద్యనిపుణులు న్యూయార్క్ మహిళకు చికిత్స చేపట్టారు. తొలుత దాత నుంచి సేకరించిన బొడ్డుతాడు మూలకణాలను మార్పిడి చేశారు. ఆ మర్నాడు.. ఆమె బంధువు నుం చి సేకరించిన మూలకణాలను(అడల్ట్ స్టెమ్‌సెల్స్) కూడా ఆమె శరీరంలోకి ప్రవేశపెట్టారు.
ఇదంతా 2017లో జరిగింది. చికిత్స జరిగిన 37 నెలల తర్వాత ఎయిడ్స్‌కు యాంటీ రెట్రో వైరల్ ఔషధాల వాడకాన్ని ఆపేసింది. ఇప్పటికి 14 నెలలుగా ఆమె ఆ మందులు వాడకున్నా.. ఆమె శరీరంలో హెచ్‌ఐవీ ఆనవాళ్లు లేవని వైద్యులు తెలిపారు. గతంలోనూ ఇలా ఇద్దరు పేషెంట్లు మూలుగ మార్పిడి ద్వారా హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందారు
