డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అయితే కొన్ని గింజల పిండి మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. శారీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాన్ని తినడం, పేలవమైన జీవన శైలి వంటివి ఈ డయాబెటీస్ కు ప్రధాన కారణాలు. ఏదేమైనా ఇది వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అయితే కొన్ని రకాల పిండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
అమరాంత్ పిండి
అమరాంత్ పిండిలో మాంగనీస్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే గ్లూకోనియోజెనిసిస్ సమయంలో మాంగనీస్ సహాయపడుతుంది. అమరాంత్ పిండిని తీసుకోవడం ద్వారా మాంగనీస్ ను తగినంత మొత్తంలో పొందినప్పుడు డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది.
రాగి పిండి
రాగి పిండిలో పాలీఫెనాల్స్, అమైనో ఆమ్లాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. ఈ అద్భుత తృణధాన్యాలు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఆహార కోరికలను కూడా తగ్గిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్పైక్ ను నివారిస్తుంది.
చిక్పీస్ పిండి
చిక్పీస్ పిండి డయాబెటిస్ ఉన్నవారికి ఒక సాధారణ పిండి ప్రత్యామ్నాయం. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను నివారించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించేందుకు సహాయపడుతుంది.
తృణధాన్యాల బార్లీ
బార్లీ ఫైబర్ కు మంచి మూలం. దీనిలో కరిగే ఫైబర్ బీటా-గ్లూకాన్ ఉంటుంది. ఇది చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. బార్లీలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఉంటుంది. బార్లీ పిండిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తగ్గుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
బాదం పిండి
మెత్తగా రుబ్బిన బాదం పిండి మధుమేహుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ బాదం పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ పిండిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే పోషక ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం కూడా ఉంటుంది.
