కుక్కల లాలాజలం ద్వారా రేబిస్ వ్యాప్తి చెందుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కుక్క కరవడం వల్ల రేబిస్ వస్తుందని అంటారు. మరి కుక్క తన నాలుకతో మన చర్మాన్ని తాకడం వల్ల కూడా రేబిస్ వచ్చే అవకాశం ఉందా?
కుక్క కాటు కేసులు మనదేశంలో అధికంగానే నమోదవుతున్నాయి. కుక్క కరవడం వల్ల రేబిస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. దాని వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కుక్కలను ఇంట్లోనే ప్రేమగా పెంచుకునే వారు ఎక్కువ. వాటితో కలిసి జీవిస్తున్నారు. కుక్కలతో ఆడుకోవడం ఇష్టమైన వాళ్లు ప్రతిరోజూ దానితో కొంత సమయం గడుపుతారు. ఆ సమయంలో కుక్క తన యజమానికి నాలుకతో నాకడం వంటి పనులు చేస్తుంది. నాలుకలోని లాలాజలంలో రేబిస్ క్రిములు ఉంటాయి. కాబట్టి కాలిపై గాయాలు, కోతలు ఉన్నప్పుడు… కుక్క పొరపాటున అక్కడే నాలుకతో తాకితే రేబిస్ క్రిములు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న భయం ఎక్కువ మందికే ఉంది.

రేబిస్ వెరీ డేంజరస్
రేబిస్ ప్రాణాంతక వ్యాధి. రోగనిరోధక శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సోకితే బతకడం చాలా కష్టం. రేబిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా చెబుతున్నారు. రేబిస్ కేవలం కుక్కల వల్లే కాదు పిల్లి, ఇతర జంతువుల వల్ల కూడా సోకే అవకాశం ఉంది.
రాజస్థాన్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎన్.ఆర్. రావత్ మాట్లాడుతూ, "టీకా వేసిన కుక్క నాలుకతో మీ చర్మాన్ని తాకితే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ కుక్కకు రేబిస్ ఉండి, టీకా వేయకపోతే మాత్రం చాలా డేంజర్. వాటి లాలాజలం ద్వారా రేబిస్ వ్యాప్తి చెందుతుంది. కుక్క లాలాజలంలో రేబిస్ క్రిములు ఉంటాయి. మీ శరీరంపై గాయం లేదా గీత ఉంటే, రేబిస్ సోకిన కుక్క ఆ ప్రదేశాన్ని నాకితే ఆ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం రేబిస్ సోకిన కుక్క కరవాల్సిన అవసరమే లేదు, లాలాజలం చర్మంపై ఉన్న గాయానికి తగిలితే రేబిస్ వస్తుంది. రేబిస్ వైరస్ రక్తంలోకి ప్రవేశించడానికి ఒక మార్గం కావాలి. గాయాల ద్వారానే ఎక్కువ ఈ వ్యాధి శరీరంలో చేరుతుంది. కుక్క కరిచినప్పుడు చర్మంపై గాయం తగిలాకే ఈ వైరస్ లోపలికి ప్రవేశిస్తుంది.
రేబిస్ సోకిన జంతువు కరిచిన తర్వాత, వైరస్ మొదట రక్తంలోకి ప్రవేశించి ఆ తరువాత కణజాలంలోకి ప్రవేశిస్తుంది. ఇక అక్కడ్నించి శరీరంలోని నరాల ద్వారా నాడీ వ్యవస్థ, మెదడును దెబ్బతీస్తుంది. వైరస్ నాడీ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత, 5 నుండి 15 రోజుల్లో మరణం సంభవిస్తుంది.
ఎప్పుడు ప్రమాదం ఎక్కువ?
రేబిస్ సోకిన కుక్క నాకినప్పుడు, మీ శరీరంపై గీత లేదా గాయం ఉంటే ప్రమాదం ఎక్కువ. కుక్క మీ పెదవులు, కళ్ళు లేదా నోటి దగ్గర నాకితే ప్రమాదం ఎక్కువ. మీ శరీరంపై గాయాలు ఉంటే కుక్కలకు దూరంగా ఉండాలి.

రేబిస్ సోకిన కుక్క లాలాజలం మీ గాయం లేదా గీతపై పడితే, వెంటనే చికిత్స తీసుకోండి. కుక్క కరిచిన వెంటనే ఆ ప్రదేశాన్ని సబ్బుతో కనీసం 15 నిమిషాలు కడగాలి. అయోడిన్ లేదా స్పిరిట్ పూయాలి. వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడికి అన్ని వివరాలు చెప్పండి. వైద్యుల సలహా మేరకు రేబిస్ టీకా వేయించుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే రేబిస్ వ్యాధి ముదిరిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
