ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ ఈ పండును డయాబెటీస్ పేషెంట్లు తినాలా? వద్దా? అని అనుమాన పడుతుంటారు చాలా మంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..?  

ద్రాక్షలు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులో ఉంటాయి. ద్రాక్షల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ద్రాక్షల్లో శక్తి 69 కిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు 18.1 గ్రాములు, డైటరీ ఫైబర్ 0.9 గ్రాములు, కొవ్వు 0.16 గ్రాములు, ప్రోటీన్ 0.72 గ్రాములు ఉంటాయి. 

ద్రాక్ష రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందా?

ద్రాక్షలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. ద్రాక్షలో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

ద్రాక్షలో ఉండే అత్యంత ముఖ్యమైన పోషకాలలో రెస్వెరాట్రాల్ ఒకటి. ఇది పాలీఫెనాల్. దీనిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. రెస్వెరాట్రాల్ ఇన్సులిన్ సున్నితత్వం, గ్లూకోజ్ తీసుకోవడాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

ద్రాక్షలో గ్లైసెమిక్ ఇండెక్స్ 56 గా ఉంటుంది. ద్రాక్షలో అనేక పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి హైపర్ గ్లైసీమియాను తగ్గించడానికి, బీటా కణాల పనితీరును మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పాలీఫెనాల్స్ అన్ని రకాల ద్రాక్షలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశమే ఉండదు. 

డయాబెటిస్ ఉన్నవారికి ద్రాక్ష ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ద్రాక్షలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రక్టోజ్. వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎండుద్రాక్ష అని కూడా పిలువబడే కిస్ మిస్ లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు. 

కొంతమందికి ద్రాక్షకు కూడా అలెర్జీ ఉండొచ్చు లేదా దీనిలో ఉండే సహజ చక్కెరలు ఉబ్బరం, వాయువు లేదా విరేచనాలు వంటి జీర్ణశయాంతర సమస్యలను కలిగించొచ్చు. ద్రాక్షను తినేటప్పుడు మీ శరీర ప్రతిస్పందనలను గమనించండి. అవి తింటున్నప్పుడు ఏవైనా సమస్యలు వస్తే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఎన్ని ద్రాక్ష తినాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్లు ప్రతిరోజూ ద్రాక్షలను తినొచ్చు. 1/2 కప్పు కంటే ఎక్కువగా తినకూడదు. దీనిలో 14 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 58 కేలరీలు, 1 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ తో పాటుగా ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.