ప్రపంచ వ్యాప్తంగా గుండె సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గుండె జబ్బులు మీకు రాకూడదంటే కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది గుండె జబ్బులతోనే చనిపోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు గుండెపోటు పెద్దవయసు వారికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండె సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. అసలు గుండె జబ్బులు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి అసలు కారణాలేంటో తెలుసుకోవాలి. పేలవమైన ఆహారం గుండెను గణనీయంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అసలు గుండెపోటుకు ఎలాంటి కారకాలు దారితీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ధూమపానం
సిగరెట్ పొగలోని రసాయనాలు రక్తం చిక్కగా మారడానికి కారణమవుతాయి. అలాగే సిరలు, ధమనుల లోపల రక్తం గడ్డకట్టడానికి కారణమవుతాయి. రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు రావొచ్చు. లేదా ఆకస్మిక మరణానికి దారితీయొచ్చు. అందుకే స్మోకింగ్ కు దూరంగా ఉండటమే మంచిదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తపోటు
అధిక రక్తపోటు మప ధమనులను తక్కువ స్థితిస్థాపకంగా మార్చి గుండెను దెబ్బతీస్తుంది. ఈ అధిక రక్తపోటు మీ గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులకు దారితీస్తుంది. అందుకే అధిక రక్తపోటును ఎప్పుడూ నియంత్రణలోనే ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
అధిక కొలెస్ట్రాల్
చెడు కొలెస్ట్రాల్ ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. ఎందుకంటే అదనపు కొలెస్ట్రాల్ ధమనుల గోడలలో పేరుకుపోతుంది. అలాగే ఇది గుండె, ఇతర అవయవాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల గుండె పోటు వస్తుంది.
డయాబెటిస్
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే రక్త నాళాలు, మీ గుండెను నియంత్రించే నరాలు దెబ్బతింటాయి. దీంతో మీ గుండెకు ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందవు. అలాగే రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. లేదా మొత్తమే అందదు.
అధిక బరువు లేదా ఊబకాయం
అధిక బరువు మీ ధమనులలో కొవ్వు పదార్ధం ఏర్పడటానికి దారితీస్తుంది. మీ గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనులు దెబ్బతిని మూసుకుపోతే మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
