తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపార్వతి. మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గత ఐదేళ్లలో చేసిందేమీ లేదన్నారు. 

ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. కమీషన్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని లక్ష్మీపార్వతి దుయ్యబుట్టారు. పీపీఏ, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు ఇలా అన్నింటిలోనూ ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 

ఈ సందర్భంగా మాజీమంత్రి నారా లోకేష్ పై అసహనం వ్యక్తం చేశారు లక్ష్మీపార్వతి. ట్విట్టర్ లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబు నాయుడిదేనని విమర్శించారు. ఏనాడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం నారా లోకేష్ చేయలేరని దుయ్యబుట్టారు. 

రాష్ట్రంలో అవినీతికి, దోపిడీకి పాల్పడని చంద్రబాబుకు జగన్ పాలనను విమర్శించే హక్కు లేదన్నారు. పీపీఏలో చంద్రబాబు భారీగా కమీషన్లు తీసుకున్నారని విమర్శించారు. చివరకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారని విరుచుకుపడ్డారు.

కోడెల మృతదేహాన్ని పట్టుకుని శవరాజకీయం చేశారంటూ చిర్రుబుర్రులాడారు. చంద్రబాబు నాయుడు,  కుటుంబ సభ్యుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. 

ఇకపోతే ఎల్లమీడియా వైసీపీ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తోందని ధ్వజమెత్తారు లక్ష్మీపార్వతి. మహిళ అని కూడా చూడకుండా తనపై తప్పుడు కథనాలు ప్రచురించారంటూ తిట్టిపోశారు. 

టీడీపీ పాలనలో ప్రజాధనాన్ని జన్మభూమి కమిటీలు దోచుకుతిన్నాయని తిట్టిపోశారు. తల్లులు కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎఎ: జగన్ నాలుగు నెలల పాలనపై ఎలాంటి రీమార్క్ లేదన్నారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. 
 
ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని స్పష్టం చేశారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. తన తండ్రి బాటలోనే రైతుల సంక్షేమం కోసం జగన్ పాటుపడుతున్నారని కొనియాడారు. 

అధికారంలకి వచ్చిన నాలుగున్నర నెలలోనే సుమారు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత సీఎం జగన్ దేనని చెప్పుకొచ్చారు. సీఎం పరిపాలనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు బురదజల్లే ప్రకయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు లక్ష్మీపార్వతి.