గుంటూరు: య‌డ‌వ‌ల్లి సొసైటీ భూములను బాధిత రైతుల‌కు అంద‌జేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ హామీ ఇచ్చారని...ఈ హామీని నెర‌వేర్చే దిశ‌గా తొలి అడుగు పడిందన్నారు. చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని. య‌డ‌వ‌ల్లి సొసైటీ ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ రివిజ‌న్ అథారిటీ ఇచ్చిన తీర్పు మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు చెంప‌పెట్టు లాంటిద‌ని తెలిపారు. 

త‌న కార్యాల‌యంలో ఎమ్మెల్యే రజనీ గురువారం విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటి లిమిటెడ్’’ రికార్డుల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా లేదంటూ గ‌త ప్ర‌భుత్వంలో ఈ సొసైటీని ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ది కాద‌ని గురువారం రివిజ‌న్ అథారిటీ తీర్పు ఇచ్చింద‌ని, ఇది రైతులు సాధించిన విజ‌య‌మ‌ని తెలిపారు.

చిలకలూరిపేట రూరల్ మండలం యడవల్లి గ్రామంలో 1975లో అప్పటి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని 250 మంది నిరుపేద దళితులకు సర్వే నంబర్ 381లో 416.50 ఎకరాల భూమిని కేటాయించింద‌ని తెలిపారు. ‘‘యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటి లిమిటెడ్’’ పేరుతో అప్పట్లో దళితులు ఒక సొసైటీగా ఏర్పడగా.. ఏక పట్టాగా దళితులకు భూములు అందజేశారు. ఈ భూములకు సాగునీరు అందించేందుకు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3.2 కోట్లతో ఎత్తిపోతల పథకం ఏర్పాటైన విష‌యాన్ని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఈ పథకం ద్వారా దళిత రైతులు ఏటా పంటలు పండించుకుంటూ జీవిస్తున్నార‌ని తెలిపారు.

ప్రత్తిపాటి పుల్లారావు కన్ను

పత్తి వ్యాపారంతో మొదలు పెట్టి కోటాను కోట్ల రూపాయల అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కన్ను ఈ సొసైటీ భూములపై పడిందని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండ‌గా ఈ భూములు కాజేయాల‌ని చూశాడ‌ని చెప్పారు. ఈ భూముల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉండటమే దీనికి కారణమ‌న్నారు. అప్పట్లో ఈ భూముల్లో ఏ మేరకు గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి జియాలజిస్టులను పిలిపించుకుని పుల్లారావు స‌ర్వే చేయించుకున్నార‌ని వెల్ల‌డించారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బ్లాక్ పెరల్ గ్రానైట్ ఈ భూముల్లో ఉన్నట్టు అంచనాకు వచ్చారని పేర్కొన్నారు.

ద‌ర్జాగా క‌బ్జా..

ఈ భూముల ద్వారా తన ధనదాహాన్ని తీర్చుకునేందుకు పుల్లారావు అధికారాన్ని వాడుకున్నార‌ని ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని దుయ్య‌బ‌ట్టారు. అధికార విభాగాలను తనకు అనుకూలంగా వాడుకున్నార‌ని మండిప‌డ్డారు. ఈ సొసైటీ భూముల సాగుయోగ్యం కాదని వ్యవసాయశాఖ నుంచి, ఈ సొసైటీ ఎన్నో ఏళ్ల నుంచి రికార్డులు సక్రమంగా నిర్వహించడంలేదంటూ సహకారశాఖ నుంచి, ఈ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని మైనింగ్ శాఖ నుంచి, ఈ భూములను పారిశ్రామిక వేత్తలకు అమ్ముకుంటున్నారంటూ విజిలెన్స్ శాఖల నుంచి వేర్వేరుగా నివేదికలు తయారుచేయించుకున్న నీచ చ‌రిత్ర‌ను పుల్లారావు మూట గ‌ట్టుకున్నార‌ని దుమ్మెత్తిపోశారు. ఈ నివేదికలను అడ్డం పెట్టుకుని అప్పటి ప్రభుత్వం దళితుల సొసైటీని రద్దు చేసింద‌న్నారు.  ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించిందని, 2015 ఫిబ్రవరిలో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా దుర్మార్గంగా, ఏ మాత్రం కనికరం లేకుండా రద్దు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

ఆ వెంటనే రంగంలోకి  పుల్లారావు బినామీలు

ప్రభుత్వం సొసైటీ భూములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే పుల్లారావు బినామీలు ఈ భూములపై వాలిపోయార‌ని ఎమ్మెల్యే ఆరోపించారు. మైనింగ్ లీజుల కోసం దరఖాస్తు చేసుకున్నార‌ని తెలిపారు. వీళ్లంతా పుల్లారావు బినామీలేన‌ని, మాజీ మంత్రి కనుసన్నల్లోనే ఈ దురాగతానికి పాల్పడ్డారని వెల్ల‌డించారు. యడవల్లి గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచి వై.శివయ్య భార్య రమాదేవి, ఇదే శివయ్య కొడుకు వై.రవీంద్రబాబు, పుల్లారావు కుమార్తె పేరుతో గణపవరంలో ఉన్న స్వాతి ఆయిల్ మిల్లులో  సూప‌ర్‌వైజ‌ర్ గా పనిచేస్తున్న సీహెచ్ వెంకటరామిరెడ్డి, పుల్లారావు పత్తి మిల్లులో క్యాషియ‌ర్ గా పనిచేస్తున్న షకీలా సాంబశివరావు, పుల్లారావు పత్తి మిల్లులో బయ్యర్ గా పనిచేస్తున్న తాళ్లూరి సుబ్బారావు, పుల్లారావు పత్తి మిల్లులో మరో బయ్యర్‌గా ప‌నిచేస్తున్న ఎం.సుధాకర్రెడ్డి, పుల్లారావుకు చెందిన శివస్వాతి టెక్స్ టైల్స్ లో టీఎంసీ యూనిట్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న కొమ్మాలపాటి పూర్ణచంద్రరావు, పుల్లారావు కంపెనీ శివస్వాతి టెక్స్‌టైల్స్‌లో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్న మేడూరి సత్యనారాయణ లాంటి వాళ్లంతా ఆ భూముల‌పై వాలిపోయార‌ని, వీళ్లంతా పుల్లారావుకు బినామీలేన‌ని ఎమ్మెల్యే విమ‌ర్శించారు. 

అపార‌మైన గ్రానైట్ నిక్షేపాలు

యడవల్లి గ్రామంలో లభించే గ్రానైట్ లో ముఖ్యమైనది బ్లాక్ పెరల్ అని ఎమ్మెల్యే తెలిపారు. దీని ధర మీటరు రూ.12 వేల నుంచి రూ.20వేల వ‌ర‌కు ఉంటుంద‌న్నారు. సాధారణంగా ఏ క్వారీలోనైనా 6 మీటర్ల లోతు తవ్విన తర్వాతే మంచి మెటీరియల్ లభిస్తుంద‌ని, అయితే ఇక్కడ 4 మీటర్ల లోతు తవ్వితే మంచి మెటీరియల్ దొరుకుతుంద‌ని వెల్ల‌డించారు. ఎక్కువ లోతు తవ్వకుండానే నిర్వాహకులకు మంచి లాభాలు వస్తాయ‌ని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే పుల్లారావు భారీ బహిరంగ దోపిడీకి పాల్పడ్డారని వెల్ల‌డించారు.

అసలు వాస్తవాలు ఇవి..

పేద దళితులు ప్రభుత్వం నుంచి భూములు పొందినప్పటి నుంచి సొసైటీ సహకారంతో వరి, పత్తి పంటలు పండించుకుంటున్నార‌ని ఎమ్మెల్యే తెలిపారు. బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు కూడా పొందార‌ని చెప్పారు. ఆయా సంవత్సరాలలో ఏ మేరకు పంటలు సాగయ్యాయన్న సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉంద‌న్నారు. భూములు ఉప్పు కయ్యలుగా మారడానికి సమీపంలో సముద్రమేం లేదు కదా అని ప్ర‌శ్నించారు. ఈ భూములు మినహా చుట్టుపక్కల ఉన్న భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు తేలలేద‌ని చెప్పారు. సొసైటీ రికార్డులు సరిగా లేకపోతే నోటీసు ఇవ్వాలని, అలాంటిది ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సొసైటీని ఎలా రద్దు చేస్తారని ఎమ్మెల్యే మండిప‌డ్డారు. 

న్యాయం గెలిచింది

సొసైటీ భూముల బాధిత రైతులు పుల్లారావు ఆగడాలకు, అప్పటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాడార‌ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. సొసైటీ ర‌ద్దును వ్య‌తిరేకిస్తూ రివిజ‌న్ అథారిటీలో రైతులు పిటిష‌న్ దాఖ‌లు చేశార‌ని చెప్పారు. ఈ రోజు అథారిటీ తీర్పు చెప్పింద‌ని, గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైంది కాద‌ని, సొసైటీ తిరిగి కొన‌సాగుతుంద‌ని తీర్పు చెప్ప‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మ‌ని ఎమ్మెల్యే వెల్ల‌డించారు.

త‌మ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక‌ల స‌మ‌యంలో య‌డవ‌ల్లి సొసైటీ భూముల‌ను తిరిగి రైతుల‌కు అప్ప‌గిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఈ హామీ నేడు నెర‌వేర‌బోతోంద‌ని చెప్పారు. గెలిచిన ఏడు నెల‌ల కాలంలోనే య‌డ‌వ‌ల్లి బాధిత రైతుల‌కు తాము న్యాయం చేయ‌గ‌లిగామ‌ని సంతోషం వ్య‌క్తంచేశారు. బాధిత రైతుల కోసం తాను స్వయంగా రిజిస్ట్రార్ శాఖ ముఖ్య కార్యదర్శితో పలు దఫాలు మాట్లాడాన‌న్నారు. జిల్లా రిజిస్ట్రార్ శాఖ అధికారుల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్లు చెప్పారు.

మంత్రిని ప‌లుమార్లు క‌లిసి స‌మ‌స్య‌ను వివ‌రించాన‌ని తెలిపారు. త‌న హయాంలో ఎక్కడా తప్పు జరగకుండా ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేశాన‌ని చెప్పారు. ఉన్నది ఉన్నట్లుగా రిపోర్టులు ఇవ్వాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను తాను ఆదేశించిన‌ట్లు తెలిపారు. రిజిస్ట్రార్ కోర్టుకు వారు అన్ని వివరాలను నిజాయితీగా సమర్పించార‌ని పేర్కొన్నారు. ఇప్పుడు న్యాయం గెలిచింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వంలో అవినీతి, అడ్డగోలు అక్రమాలకు తావు లేదని స్ప‌ష్టంచేశారు.ఈ కార్యక్రమంలో యడవల్లి గ్రామ ప్రజలు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.