కడప స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాపై జగన్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ), ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి జగన్  సమక్షంలో క్యాంపు కార్యాలయంలో ఈ  ఒప్పంద కార్యక్రమం  జరిగింది. 

జగన్‌ సమక్షంలో అవగాహన ఒప్పందంపై ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌(కమర్షియల్‌) అలోక్‌కుమార్‌ మెహతా, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సీఎండీ పి.మధుసూదన్‌  లు సంతకాలు చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ...ఎన్‌ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకమన్నారు.కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఈ ఒప్పందం తోడ్పాటునందిస్తుందని తెలిపారు. 

కడపతో సహా రాయలసీమ ప్రజల సుదీర్ఘకల నెరవేర్చడానికి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నానని జగన్‌ అన్నారు. ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరా కోసం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు.అందుకు పలితమే ఈ అవగాహనా ఒప్పందమన్నారు.

ఏడాదికి 5 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు సరఫరా చేయనుంది. ఉక్కు ఉత్పత్తి ఖర్చును తగ్గించే చర్యల్లో భాగంగా తొలివిడతలో ప్లాంటు సమీప ప్రాంతాలనుంచి ఐరన్‌ఓర్‌ను సరఫరా చేయాలని ఎన్‌ఎండీసీని ప్రభుత్వం కోరింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఎన్‌ఎండీసీ డీజీఎంలు కొడాలి శ్రీధర్, డీ.కె.కుందు, ఎస్‌.ఎం. వి.కార్తీక్‌  లతో పాటు మరికొందరు అధికారులు పాల్గొన్నారు.