వైఎస్సార్ రైతు భరోసా పేరుతో దగా...ఎలాగంటే...: బుద్దా వెంకన్న

ఇవాళ(మంగళవారం) ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుభరోసా పథకంపై టిడిపి నాయకులు బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. దీని పేరుతో ముఖ్యమంత్రి రైతులను మోసం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.  

ysr raithu bharosa is a fraud scheme: tdp leader buddha venkanna

విజయవాడ:  రైతు భరోసా పేరుతో రైతన్నలను ప్రభుత్వం దగా చేస్తోందని టిడిపి నాయకులు బుద్దా వెంకన్న ఆరోపించారు. ఎన్నికల సమయంలో రూ. 12,500  ఇస్తానని హామీఇచ్చి ఇప్పుడేమో రూ.7,500 మాత్రమే రైతులకు ఇస్తున్నారని తెలిపారు. ఇలా అన్నంపెట్టే రైతులను మోసం చేయడానికేనా జగన్ ముఖ్యమంత్రి అయ్యింది...? అని వెంకన్న  ప్రశ్నించారు.  

గతంలో టీడీపీ తీసుకువచ్చిన రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ప్రభుత్వ రద్దు చేయడాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే చంద్రన్న భీమా వంటి మంచి పథకాన్ని రద్దు చేశారని...ఇది నిరుపేద కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడేదన్నారు. అలాంటి పేదోడి పథకాన్ని రద్దు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు.

రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ  పథకం పేరుతో కులాలని, మతాలను విడదీయాలని చూస్తున్నారని...  ఇది వీరికి అలవాటయిపోయిందన్నారు. 

ఈ ప్రభుత్వం తమ  పార్టీ కార్యకర్తలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించి, రైతులకు తక్కువ కేటాయించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ కు పరిపాలనపై అవగాన లేదు... ఇలా ఎంతోకాలం రాష్ట్రాన్ని పరిపాలించలేరన్నారు. 

జగన్ కేవలం పదవి కోసమే పాదయాత్ర చేశారని తెలిపారు. ప్రజల సమస్యలు ఆయనకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా అవసరం లేదన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పి...పీఎం నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లి ఏం మాట్లాడారో మీకందరికి తెలిసిందేనని గుర్తుచేశారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది..అయినా పరిపాలన సజావుగా సాగించారని ప్రశంసించారు. కేవలం జమిలి ఎన్నికలు వచ్చే వరకు ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడని... ప్రజల నుండి ఆయనపై, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని బుద్దా వెంకన్న తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios