Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు పాలన వల్లే లోకేష్ ఓటమి: అంబటి రాంబాబు

టీడీపి అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనను చూసే నారా లోకేష్ ను ప్రజలు ఓడించారని అన్నారు. వైఎస్ జగన్ అవినీతి అంతానికి కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. 

YCP MLA Amabti Ramababu lashes out at Chandrababu
Author
Tadepalli, First Published Sep 7, 2019, 1:39 PM IST

తాడేపల్లి: ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వంపై బురదచల్లుతూ తన అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

చంద్రబాబు పాలన చూసిన ప్రజలు ఎన్నికల్లో ఆయన కుమారుడు నారా లోకేష్ ను ఓడించారని,  ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని అంబటి రాంబాబు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే టీడీపీ నాయకులెవరూ పాల్గొనలేదని, ఇప్పటికైనా చంద్రబాబు ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని ఆయన అన్నారు. 

రాజకీయ అవినీతిని అంతం చేయాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆయన చెప్పారు. వంద రోజుల పాలనలో జగన్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

టీడీపి హయాంలో మట్టి, ఇసుక, సహజ సంపదలను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేసిన మేలు ఏమిటో ప్రజలందరికీ తెలుసునని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అందుకే చంద్రబాబు పాలన ప్రజలకు దూరమైందని, ఇప్పుడు చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా కలిసి ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios