విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి పాలనలో అన్నీ నల్లచట్టాలు, నల్లజీవోలు, బ్లాక్ డేలే అని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణడు ఆరోపించారు.  ఏపి పంచాయితీరాజ్ చట్టం 1994 సెక్షన్ 211, 212కు చేసిన సవరణలే జగన్ చీకటి పాలనకు నిదర్శనాలన్నారు. ఆర్డినెన్స్ లో ‘‘ఎన్నికల తర్వాత కూడా(even after election)’’అని పేర్కొనడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. 

ఎన్నికల ప్రక్రియ అనేది ఈసి పరిధిలోని అంశమని.... దీంతో ప్రభుత్వానికి ఏమిటి సంబంధం..? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి మొత్తం ప్రక్రియ ఈసి పరిధిలోనే ఉంటుందన్నారు.  అయితే ఏదో వంకచూపి గెలిచిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులపై కక్ష సాధించడానికే వైసిపి ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలు చేసిందని అన్నారు. ప్రతిపక్షాలపై కక్షసాధించాలనే దుర్బుద్ధి ఈ సవరణల వెనక దాగుందన్నారు. 

అసలు ఎన్నికల అంశంలో ప్రభుత్వానికి సంబంధమే వుండదని అలాంటిది ఎన్నికల ముగిశాక చర్యలు తీసుకుంటామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.   ఎన్నికల పిటిషన్లపై చర్యలు తీసుకోవాల్సింది కోర్టులని...వీటితో ప్రభుత్వానికి సంబంధం ఉండదని తెలిపారు. 

read more  స్థానికసంస్థల ఎన్నికలు... బాబు ఇలాకాలో రికార్డు మోత

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చట్టసభల్లో కరెప్ట్ ప్రాక్టీసెస్ పై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానిది... ఎన్నిక పూర్తయ్యాక వేసే పిటిషన్లు కోర్టు పరిధిలో ఉంటాయన్నారు. ఎన్నికల పిటిషన్లు సీఈసికి కోర్టు పంపితే అక్కడ నుంచి రాజ్యాంగాధినేతకు పంపుతారన్నారు. అనర్హతపై నిర్ణయం ఆయన నోటిఫై చేస్తారని ప్రజా ప్రాతినిధ్య చట్టం చెబుతుందన్నారు.

ఎన్నికల తర్వాత పిటిషన్లపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని... ఎన్నిక జరిగేటప్పుడు గాని, ఎన్నిక పూర్తయ్యాకగాని ఈ ప్రక్రియతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదన్నారు. కాబట్టి సెక్షన్ 211, 212కు చేసిన సవరణలు పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకని తెలిపారు. 

ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లను భయపెట్టడం, ప్రతిపక్షాల అభ్యర్ధులను పోటీకి రాకుండా చేసేందుకే ఈ చీకటి ఆర్డినెన్స్ దొడ్డిదారిన తెచ్చారన్నారు. ఫాక్షనిస్ట్ పాలనలో ఇటువంటి ‘‘చీకటి చట్టాలే’’ చేస్తారని విమర్శించారు. 

''భయపెడితే ఇక ప్రజాస్వామ్యానికి విలువ ఏం ఉంటుంది..? బెదిరిస్తే, వేధిస్తే, ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యం..? వైసిపి ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ చెల్లదు.  రాజ్యాంగ వ్యతిరేకమైన ఆర్డినెన్స్ ఇది. అప్రజాస్వామికమైన ఆర్డినెన్స్ ఇది. టిడిపి దీనిని న్యాయస్థానాల్లో సవాల్ చేస్తుంది. ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంది. ఇటువంటి దుర్మార్గ చర్యలకు ప్రజలే బుద్ది చెప్పాలి'' అని అన్నారు. 

read more  టీడీపీ రాజ్యసభ అభ్యర్ధిగా వర్ల రామయ్య: చంద్రబాబు ప్రకటన

''రేపటి ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధులను అన్నిచోట్లా ఓడించాలి.  ఈసి షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికలను వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదు. ఎన్నికల వాయిదా, నిలిపివేత అధికారాలు ఈసికే ఉంటాయి.  8జడ్పిటిసి, 345ఎంపిటిసి స్థానాల్లో ఎన్నికలు ఎలా నిలిపేస్తారు..? ఎన్నికలను కలెక్టర్లు ఎలా వాయిదా వేస్తారు..? గెలవమనే ఉద్దేశంతోనే వైసిపి నేతలు వాయిదా వేయించారు'' అని ఆరోపించారు. 

''ప్రభుత్వం చేతిలో కలెక్టర్లు పావులుగా మారారు. 66మండలాల్లో బీసిలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారు. ఎంపిటిసిలు లేకుండా ఎంపిపి బీసిలకు ఎలా వస్తుంది.? వైసిపి ప్రభుత్వ గుడ్డి పాలనకు ఇదే రుజువు. జగన్మోహన్ రెడ్డి పైకి నీతులు చెబుతారు కానీ విపరీతంగా బెదిరిస్తారు, ప్రలోభాలు చూపి లాక్కుంటారు, బిల్లులు ఇవ్వకుండా వేధిస్తారు, తప్పుడు కేసులు పెట్టి భయపెడతారు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం చేస్తారు, ఎన్నికల వ్యవస్థ అపహాస్యం చేస్తారు'' అని విమర్శించారు.  

''ఇలాంటి అరాచక పాలన రాష్ట్రంలో గతంలో లేదు.  మంత్రులతో జగన్ ‘‘డూ ఆర్ డై పాలసీ’’ అన్నారు. ఓటమి భయంతోనే అనేక అరాచకాలు చేస్తున్నారు. వైసిపి నేతల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి'' అని యనమల రామకృష్ణుడు వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మండిపడ్డారు.