తుళ్లూరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో గందరగోళంలోకి నెట్టిందని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అసలు ముఖ్యమంత్రి జగన్ అధికార వికేంద్రీకరణ చేస్తారో, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తారో ముందు తేల్చాలని అన్నారు.  ప్రాంతీయ పార్టీలకు విశాల దృక్పధం ఉండదని...వారసత్వ పరిపాలన కోరుకుంటారని అన్నారు. వైసిపి, టిడిపి లు ఇదే కోవకు చెందిన ప్రాంతీయ రాజకీయ పార్టీలని అన్నారు. 

ప్రస్తుత నిర్ణయంతో ఆందోళనకు దిగిన అమరావతి ప్రాంత రైతులతో మంత్రుల కమిటీని పంపి చర్చించాలని సీఎం జగన్ కు విష్ణువర్ధన్ రెడ్డి సలహా ఇచ్చారు. రాజధానికులాల సమస్య కాదని... 33వేల ఎకరాల భూములిచ్చిన రైతుల సమస్య  అని గుర్తించాలని అన్నారు. 

 సీడ్ కాపిటల్ అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి ప్రాంతంలోని రైతులు ఆందోళన చెందవద్దని... వారికి  బీజేపీ అండగా వుంటుందన్నారు. అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణకు సహకరిస్తామని...  రాష్ట్ర ప్రభుత్వం రైతులతో బేషరతుగా చర్చలు జరిపి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 

read more  అమరావతి రైతుల వినూత్న నిరసన... ప్రధానికి ఆధార్ కార్డులతో కూడిన లేఖలు

సంవత్సరంలో మూడు పంటలు పండే భూములను ఇష్టానుసారం వాడుకుని ఇప్పుడు వెనక్కి ఇస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. ఇక్కడి భూములు చాలా సారవంతమైనని గుర్తుచేశారు.

సాంప్రదాయ బద్దంగా పవిత్ర నదీ జలాలు తెచ్చి ప్రధాని మోదీ ఇక్కడ శంకుస్థాపన చేశారన్నారు. అలాంటి చోటినుండి రాజధానిని తరలిస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ ఉందంటే అది బీజేపీ మాత్రమేనని అన్నారు. ఇంతకాలం గడ్డివేసిన రైతులు పాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడటం అత్యంత బాధాకరమన్నారు. అమరావతి ప్రాంతంలో 18 రకాల కులాలు ఉన్నాయని... ఒకే సామాజిక వర్గం అనేది అవాస్తవమన్నారు.  

టీడీపీ నాయకులు ఇక్కడ  భూములు, పొలాలు కొన్నా, కొనకపోయినా రైతులకు ఒరిగింది ఏమి లేదన్నారు. ఆర్థికంగా ఎదిగిన రాష్ట్రాలు కనుక రెండు మూడు చోట్ల నుండి పరిపాలన సాగిస్తున్నారని... కానీ ఆర్థికంగా ఏపీ వెనుకబడి ఉంది  కాబట్టి ఇక్కడ మూడు చోట్ల నుండి పరిపాలన ఎలా చేస్తారని అన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలిష్టంగా తయారు చేసి మూడు చోట్ల కాకపోతే ఎన్ని చోట్లనుండి అయినా పరిపాలన చేయవచ్చని సూచించారు. 

సంక్రాంతికి కోడిపందాలు నిర్వహించి తీరతాం: వైసిపి ఎంపీ బహిరంగ ప్రకటన

ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఆడిందే ఆట, పాడిందే పాట అంటే ఎలాగని... రాజధాని అంటే చిన్న విషయం కాదన్నారు. 30,000 వేల కుటుంబాలు తమ భూములు త్యాగం చేసినట్లు గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ బీజేపీ మద్దత్తుగా వుంటుంది కానీ పరిపాలన వికేంద్రీకరణ కి  విరుద్ధమన్నారు. 

ఇదే ప్రాంతంలో గతంలో మోడీ గో బ్యాక్ గోబ్యాక్ అన్నారు... ఇప్పుడు కమ్ బ్యాక్ అంటున్నారని పేర్కొన్నారు. నమ్మి ఓటు వేసిన రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించిన రాజకీయ పార్టీలకు ఏ గతి పట్టిందో తెలుసుగా... ఈ లిస్ట్ లోకి వైసీపీ పార్టీ వచ్చేలా చేసుకోవద్దన్నారు. 

రైతుకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేదని... 365 రోజులు తన పని తాను చేసుకుంటూ పోతారని అన్నారు. రైతుల ఉద్యమంలోకి రాజకీయాలు రానివ్వొద్దని సూచించారు. రైతుల ఉద్యమం దేవాలయంలా పవిత్రమైనదని...దేశంలోని ప్రతి రైతుకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.