అమరావతి: మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళుతూ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత బహిరంగ లేఖ రాశారు. మహిళా భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చినా ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరికి న్యాయం జరిగలేదని లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని... వారిని శిక్షించకపోగా తప్పించే ప్రయత్నం చేయడం దారుణమని అనిత మండిపడ్డారు. ఈ ప్రభుత్వ హయాంలో  మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని... రోజుకొక్కరు రాక్షసుల చేతుల్లో బలవుతున్నారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. 

సీఎం జగన్ కు అనిత రాసిన లేఖ యధావిధిగా

వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి,

విషయం: మహిళలను వేధింపులకు గురి చేస్తున్న మీకు మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అర్హత లేదు.

అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు మహిళలను గౌరవించు అనేది మన దేశ సంస్కృతి. కాని నేడు రాష్ట్రంలోని పాలక వర్గాలకు ఆ స్పృహ కొరవడింది. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడంలో మీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మహిళల అభివృద్ధికి, అభ్యున్నతికి చేయూతనివ్వాల్సింది పోయి... భయకంపితులయ్యేలా అడుగులు వేయడం సిగ్గుచేటు. అన్నెంపుణ్యం ఎరుగని చిన్నారుల నుండి పండు ముదుసలుల వరకు జరుగుతున్న అత్యాచారాలకు అడ్డాగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అవమానాలు, అత్యాచారాలకు గురవుతున్నారు. 

గత 10 నెలల్లో మీరు మహిళలకు చేసింది శూన్యం. మహిళలకు అండగా ఉండేందుకు దిశ చట్టం తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటూనే ఆ చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకొని చచ్చుబండలు చేసేల వ్యవహరించడం హేయం. గుంటూరు జిల్లా గురజాలలో మైనార్టీ బాలికలపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కానాల నరేంద్ర రెడ్డి అత్యాచారం చేశాడు. ప్రకాశం జిల్లా రుద్రమాంబపురంలో బనంగారి పద్మ అనే మహిళను వైసీపీ నేతలు వివస్త్రను చేసి దాడి చేస్తే అవమానంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో ప్రభుత్వ సేవల ముసుగులో వచ్చి దళిత మహిళపై గ్రామ వాలంటీర్ అత్యాచార యత్నం చేశాడు. ఇలాంటి ఘటనలు గత పది నెలల్లో వందల కొద్దీ నమోదయ్యాయి. దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితుడికి శిక్ష వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఈ ఘటనల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు.?. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు మహిళలపై అకృత్యాలకు తెగబడితే ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు?  

 దిశ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు దాదాపు 55 కేసులు నమోదు అయితే ఇంత వరకు ఒక్క కేసులో కూడా చర్యలు తీసుకోలేదు. 182 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. అంటే వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత రోజుకు సగటున 1 మహిళ బలవుతున్నా మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.? మీ పార్టీలోని ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, వందలాది మంది నాయకులపై మహిళలను వేధించిన కేసులున్నాయి. అలాంటి వారిని మీ పార్టీ నుండి సస్పెండ్ దిశా చట్టం ఎందుకు అమలు చేయలేదు.? 

గడిచిన 10 నెలలుగా మీ తగ్లక్ చర్యలకు మహిళా ఉద్యోగినులు అవస్థలకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు కీచకుల్లా మారుతున్నారు. ఉద్యోగినులపై రాజీనామాలు చేయమని ఒత్తిడిలకు గురి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారంటూ మహిళా కార్యకర్తలు, ఉద్యోగినులపై దాడులకు తెగబడ్డారు. మీ దుశ్శాసన పర్వాలకు తాళలేక దాదాపు 15 మంది మహిళా ఉద్యోగినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరు జిల్లాకు చెందిన మీ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి మద్యం సేవించి అర్ధరాత్రి మహిళా ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేస్తే ఎందుకు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు?

అమరావతికి మద్ధతు ఇవ్వమని ఎంపీ నందిగం సురేష్ ను మహిళలు కోరితే వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న మహిళలను పోలీసు బూటు కాళ్లచే తన్నించారు. అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారు. దుర్బాషలాడుతూ అవమానాలకు గురి చేస్తున్నారు. రాజధాని పోరాటం చేస్తున్న మహిళలంతా పెయిడ్ ఆర్టిస్టులని ఇష్టానుసారంగా దుర్బాషలాడుతూ అవమానాలకు గురి చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల పింఛన్లను ఎత్తి వేస్తే అందులో అధిక భాగం మహిళలవే. పేద వధువులకు అండగా నిలిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పెళ్లి కానుకలను గత 10 నెలలుగా నిలిపివేశారు. దాదాపు 77వేలకు పైగా దరఖాస్తులను పెండింగులో పెట్టారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్లు ఇస్తామని హామీనిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత దారుణంగా మోసం చేశారు.   మద్య నిషేదం చేస్తామని చెప్పి అడ్డ దారిలో  మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. పిచ్చి కంపెనీల మద్యాన్ని తీసుకువచ్చి పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మహిళల పుస్తెలు తెంచుతున్నారు. జే ట్యాక్స్ ద్వారా మీ జేబులు నింపుకుంటూ పేద మహిళల కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు.  

మహిళా సహకార ఆర్ధిక సంస్థను నిర్వీర్యం చేశారు. ఇంత వరకు ఒక్క రుణం మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం అందించిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి వేలాది మంది మహిళా కూలీల పొట్ట కొట్టారు. ఇన్ని రకాలుగా మహిళలను వేధించి, అవస్థలకు గురి చేసి ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అర్హతను కోల్పోయారు. నరకాసురుడు ఎంత బలవంతుడు అయినప్పటికీ.. సామాన్యురాలిగా ఉన్న సత్యభామ చేతిలో కుక్క చావు చచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో నరకాసురున్ని మించి పోయిన మీ అకృత్య పాలనకు ఒక్కో మహిళ ఒక్కో సత్యభామగా మారి చరమ గీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. 

                                                                                                                                                                                                                                         వంగలపూడి అనిత
                                                                                                                                                                                                                            రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు