గుంటూరు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల అంశం మలుపు తిరిగింది. గుంటూరు జిల్లాలో భార్యాభర్తలకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలో బయటపడిన తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇవే. 

ఆ దంపతుల కరోనా వైరస్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. వారిని విజయవాడ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. వారి డిశ్చార్జి విషయంలో సందిగ్దత నెలకొంది.  ఆ తర్వాత వారికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దాంతో వారిని తిరిగి ఓ ప్రైవేట్ వైద్య కళాశాల ఆస్పత్రిలోని క్వారంటైన్ కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రాత్రినాటికి 420 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా గుంటూరు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గుంటూరు జిల్లాలో కొత్తగా 7 కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 2 కేసులు నిర్ధారణ అయ్యాయి, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కటేసి కేసులు బయటపడ్డాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 84 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. గుంటూరులో 82 కేసులు రికార్డయ్యాయి.