సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులెన్నో పాసయ్యాయి...: టిడిపి అధ్యక్షుడి వ్యాఖ్యలు
ఏపి రాజధానిపై శాసనమండలిలో చర్చ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: అసెంబ్లీని వదిలేసి మండలిలో 22మంది మంత్రులు ఎందుకు కూర్చున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీమంత్రి కిమిడి కళావెంకట్రావు వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటింగ్ నిర్వహించకూడదని మంత్రివర్గ సభ్యులందరూ మండలిలో కూర్చునేలా సీఎం జగన్ ఎందుకు ఆదేశించాడని... వారంతా మండలి ఛైర్మన్‌ని, ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని రాచిరంపాన పెట్టాల్సిన అవసరమ ఏమొచ్చిందో చెప్పాలన్నారు.
గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వం కూడా ఏడునెలల్లో ఇంతలా భ్రష్టుపట్టిన దాఖలాలను తాము చూడలేదన్నారు. మంత్రులు, వైసీపీ సభ్యుల ప్రవర్తన చూస్తుంటే, రాష్ట్ర ప్రజలంతా సిగ్గుపడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మంత్రులు మండలిలో ప్రవర్తించారన్నారు.
తుగ్లక్ చర్యలకు నిరసనగా ఇప్పటవరకు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి 25సార్లు అక్షింతలు వేసిందన్నారు. కౌన్సిల్‌లో బుధవారం జరిగిన చర్చపై, అసెంబ్లీలో నేడు (23వ తేదీన) చర్చించడం చూస్తూంటే ఆ వాతావరణమంతా కౌరవసభను తలపిస్తోందన్నారు. కౌన్సిల్ జరిగిన తీరుని, అసెంబ్లీలో లేని సభ్యులను తప్పుపడుతూ ఎలా చర్చిస్తారో, ఏ రూల్‌ను అనుసరించి చర్చించారో, రాజ్యాంగం ప్రకారం అది ఎలా సాధ్యమో చెప్పాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.
read more చంద్రబాబు అనుభవం అందుకు ఉపయోగపడింది: చెవిరెడ్డి సెటైర్లు
స్పీకర్లు ఎవరూ ఇలాంటి చర్చలను స్వాగతించరని... ఇప్పుడున్న స్పీకర్ ఎలా ఒప్పుకున్నాడో తెలియడంలేదన్నారు. పార్లమెంటరీ ప్రాక్టీసెస్, కౌల్ అండ్ షక్దర్ నిబంధనల ప్రకారం గతంలో అనేక బిల్లులు అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు వచ్చాయని, అక్కడి నుంచి సెలక్ట్ కమిటీకి పంపబడ్డాయని, అక్కడినుంచి వచ్చాక పాసయిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకింత తపన పడుతోందని, రెండు, మూడునెలలు కూడా ఆగకుండా ఎందుకింతగా ఆత్రుతపడుతుందో తెలియడం లేదన్నారు.
ప్రభుత్వ తపన చూస్తుంటే వ్యాపారాలు, వ్యవహారాలు, భూముల అమ్మకంపై తమవారికి ఇచ్చిన హామీలపై ఆందోళన చెందుతున్నట్లుగా ఉందన్నారు. బిల్లు సెలక్ట్ కమిటీకి పంపగానే దూషణలకు దిగుతూ అంతలా సృతిమించి ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందని కళా నిలదీశారు. మండలిలో మంత్రులంతా హద్దుమీరి ప్రవర్తించారని, బల్లలపైకి ఎక్కి కులం-మతం పేరుతో దూషిస్తూ ఉన్నతమైన స్థానంలో ఉన్నవ్యక్తిని ఉద్దేశించి వాడిన పదజాలాన్ని రాష్ట్ర ప్రజానీకమంతా గమనించిందన్నారు.
మండలిలో మంత్రులు వాడిన భాష, వారి ప్రవర్తనకు సంబంధించిన వీడియోలను ప్రజల ముందుపెట్టాక ప్రభుత్వం మండలి తీరుతెన్నులపై మాట్లాడాలని కళా సూచించారు. అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్షపార్టీ సభ్యులకు విడిగా సీట్లు కేటాయించడం ఎలా సాధ్యమైందో అలాగే మండలి ఛైర్మన్ వ్యవహరించారని, స్పీకర్ చేస్తే తప్పుకానప్పుడు మండలి ఛైర్మన్ చేసింది తప్పెలా అవుతుందన్నారు.
read more ఎమ్మెల్సీగా మంత్రి పదవి... మండలి రద్దు చర్చపై మోపిదేవి ఏమన్నారంటే
ఉన్నతమైన లోక్‌సభ, రాజ్యసభల్లో కూడా ఏనాడూ ఎవరూ సంయమనం కోల్పోలేదని, మార్షల్స్‌ను ఇష్టానుసారం వినియోగించడం, గీతలు గీయమని చెప్పడం ప్రజాస్వామ్యంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే, తిరిగి ప్రశ్నించడం తప్ప ప్రభుత్వం ఎక్కడా సరైనవిధంగా సమాధానం చెప్పడంలేదన్నారు. మండలిలో బిల్లు పాస్ కాలేదని దాన్ని రద్దుచేయడం, మాటవినలేదని ఉద్యోగుల్ని డిస్మిస్‌చేయడం పాలనకాదని, అధికారంతోపాటు బాధ్యతలుకూడా ఉంటాయని గుర్తిస్తే ప్రభుత్వానికి మంచిదని కళా వెంకట్రావు మంచిదన్నారు.