గుంటూరు: రాజధానిని చంపేసేందుకు లేని సమస్యలుసృష్టిస్తూ అభూత కల్పనలతో ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పడం ద్వారా నిజమని ప్రచారం చేయడానికి వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు. గురువారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు ఎలా సమకూర్చుకోవాలన్న సమస్యను వదిలేసి రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికే సెటిల్‌ అయిన అంశాలను అన్‌సెటిల్డ్‌ అంశాలుగా మార్చేసి తిరిగి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్నారని.... ఇదిరాష్ట్ర తిరోగమనానికి నిదర్శనమని రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. 

ఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌ ప్రకారం రాజధాని నిర్మాణం, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టుతో పాటు ఉద్యోగులకు వసతి సముదాయాల వంటివి ఏర్పడ్డాయని, హైదరాబాద్‌ నుంచి ఉద్యోగులు తరలివచ్చి తమ విధులు నిర్వహించడమనే ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందన్నారు. దీనిని చిన్నాభిన్నం చేయడం ఎవరికీ సాధమయ్యే పనికాదని కనకమేడల తేల్చిచెప్పారు. 

గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ వేదికగానే ఇప్పుడున్న పాలకులు 7నెలలుగా పరిపాలన కొనసాగిస్తున్నారని, ఈవిధంగా ఒక క్రమపద్ధతిలో ఉన్న వ్యవస్థను చెల్లాచెదురు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ఎంపీ ప్రశ్నించారు. లేని సమస్యలను సృష్టించడం, తిరిగి వాటిని పరిష్కరించడానికి తామేదో ప్రయత్నం చేస్తున్నట్లు నటిస్తూ ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించారన్నారు. 

సెటిల్డ్‌ అంశాలను అన్‌సెటిల్డ్‌ అంశాలు గా మార్చడమనేది ప్రజల జీవితాలతో చెలగాటమాడటమేనన్నారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితి బాగోలేదు కాబట్టి నిధులు లేవు కాబట్టి రాజధానిని నిర్మించలేమని, అందుకు అవసరమైన రూ.లక్షా10వేల కోట్లు తమ వద్ద లేవు కాబట్టి రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని పాలకులు అవాస్తవాలు చెబుతున్నారన్నారు.

నిర్మాణమనేది దశాబ్దాల ప్రక్రియ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ..అమరావతి తరలింపుకు వెచ్చించే నిధుల్ని రాజధాని నిర్మాణానికి ఉపయోగించడం ద్వారా  అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తిచేయవచ్చని... మరింత అభివృద్ధి చేయవచ్చని కనకమేడల సూచించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ల నిర్మాణం ఒక్క రోజులోనో, ఒక్క ఏడాదిలోనో పూర్తవ్వలేదన్నారు. నగరాల నిర్మాణమనేది దశాబ్దాల ప్రక్రియ అని, అభివృద్ధి అనేది నిరంతరంసాగే ప్రక్రియని ఆయన అభిప్రాయపడ్డారు.  

read more  బొత్సా... ఫినాయిల్ పంపించా, ఇకపై దాంతోనే...: మాజీ మంత్రి జవహర్‌ సీరియస్

దేశంలోని ప్రధాననగరాలైన కోల్‌కతా, ముంబై, చెన్నై, వంటి నగరాల ద్వారా వచ్చే ఆదాయమే ఆయా రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. కోల్‌కతాపై వచ్చే 76 శాతం ఆదాయంతో పశ్చిమబెంగాల్‌లోని 294నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అలానే హైదరాబాద్‌ ద్వారా 60 నుంచి 70శాతం ఆదాయం వస్తుందని, ముంబైనుంచి 60శాతం, చెన్నై నుంచి 40శాతం ఆదాయం వస్తోందన్నారు.  

నగరాల సృష్టిద్వారానే సంపద  వస్తుందని, తద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందనే కనీస ఆలోచనకూడా రాష్ట్రపాలకులకు లేకపోవడం విచారకరమన్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఉన్నంతమాత్రాన నగర అయిపోదని, వివిధరకాల పరిశ్రమలు, సంస్థలు తరలివస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఆ క్రమంలోనే అమరావతిని నవ నగరాలుగా నిర్మించడానికి ఆనాడు చంద్రబాబునాయుడు 53,748ఎకరాలు సేకరించారన్నారు. 

ఆ భూమిని 9నగరాల నిర్మాణానికి ఉపయోగించగా  మిగిలిన 10వేల ఎకరాలను వాణిజ్యపరంగా వినియోగించుకోవడం ద్వారా వచ్చే ఆదాయంతో అమరావతిని సుందరనగరంగా తీర్చిదిద్దే గొప్ప అవకాశముందన్నారు. ఈ ఆలోచనతోనే నాటి టీడీపీ  ప్రభుత్వం సింగపూర్‌ స్టార్టప్‌ ప్రాజెక్ట్‌కి 1600ఎకరాలు కేటాయించిందన్నారు.   రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఆ 1600ఎకరాల్లో ఎవరూ ఊహించనంత అభివృద్ధి జరిగేదని, తద్వారా సంపద సృష్టించబడేదని, లక్షలాది ఉద్యోగాలు వచ్చేవన్నారు. నిర్మాణప్రక్రియ కొనసాగిఉంటే లక్షలమందికి పని దొరికేదని, దానివల్ల కొనుగోలు శక్తిపెరిగి, వ్యాపారాభివృద్ధి జరిగి, రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం వచ్చేదని రవీంద్రకుమార్‌ తెలిపారు. 

రూపాయి ఖర్చులేకుండా ఏడునెలల నుంచీ రాజధానినుంచి పాలన కొనసాగించిన రాష్ట్రప్రభుత్వం, ఆప్రాంతాన్ని ఇప్పుడు కళాకాంతులు లేకుండా చేసిందన్నారు. వైసీపీ చెబుతున్నట్లుగా అమరావతి ఇప్పుడున్న దశలో, దాని నిర్మాణానికి రూ.లక్షా10వేల కోట్ల అవసరముండదన్నారు.తరలింపునకు పెట్టే ఖర్చుతో... చక్కటిపాలన చేయొచ్చన్నారు.

 రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడానికి ఎన్నివేలకోట్లు అవసరమవు తాయో, ఆమొత్తాన్ని ఆప్రాంతంలో ఇప్పటికే పూర్తయిన నిర్మాణాలకు ఉపయోగించడం ద్వారా రాజధాని మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 

read more  భువనేశ్వరి గాజుల విరాళం వివాదం... వైసిపి కౌంటర్లకు టిడిపి స్ట్రాంగ్ రియాక్షన్

8వేల గృహాలు నివాసయోగ్యంగా మారుతాయని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలన్నీ పూర్తవుతాయని, తద్వారా అమరావతినుంచే చక్కటిపాలన సాధ్యమవుతుందన్నారు. జీవో.ఎమ్‌.ఎస్‌.నెం-50ద్వారా  అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు ఎలా సమకూర్చుకోవాలనేది కాంప్రహెన్సి వ్‌ ఫైనాన్స్‌ప్లాన్‌లో ఉందన్నారు. 

అమరావతిని కొనసాగించాలని రాష్ట్రప్రభుత్వం నిజంగా అమరావతిని అభివృద్ధి చేయాలనకుంటే, 2020నుంచి 2025వరకు సుమారు రూ.6వేలుకోట్లు ఖర్చుచేస్తే, 55,348కోట్ల రూపాయల వనరులు సమకూరే అవకాశం ఉందన్నారు. కేవలం 5, 6ఏళ్లలోనే ఇది సాధ్యమవుతుందని, అప్పుడు అభివృద్ధి ప్రక్రియను కొనసాగించవచ్చన్నారు. 

ఈ ప్రకారం చేస్తే రాష్ట్రప్రజలపై ఏవిధమైన భారం ఉండదన్నారు. మిగులుభూమిని అమ్మితేనే రూ.లక్షలకోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఇది జరగాలంటే, నిర్మాణం, పాలనవ్యవహారాలు అమరావతిలోనే కొనసాగించాల్సి ఉంటుందన్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని, గజం రూ.28 వేలు అమ్మినచోటే, ఇప్పుడు రూ.5వేలు పలుకుతోందన్నారు. పూర్వీకుల ఆస్తిని త్యాగం చేసిన రైతుల్ని అవహేళనచేస్తే అభివృద్ధి జరగదని పాలకులు తెలుసుకోవాలన్నారు.  

ఇవన్నీ తెలిసికూడా కావాలనే సంక్షోభాలు సృష్టించి, పరిష్కారమైన సమస్యలను తిరగ దోడుతున్నారని కనకమేడల తెలిపారు. విభజన వల్ల జరిగిన నష్టంకంటే జగన్‌పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. తప్పుడు విధానాలు సవరించుకొని ప్రజలకు అండగా నిలిచి, రాష్ట్రాభివృద్ధికోసం పనిచేయాలన్నారు.

ఉద్యోగులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా....!రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి అమరావతికి ఉద్యోగులను తరలించడం కోసం వారికి అనేక సౌకర్యాలు, వసతులు కల్పించారని, ఆర్థికస్థితి బాగోలేకపోయినా జీతభత్యాలు ఇచ్చారని కనకమేడల తెలిపారు. అటువంటి ఉద్యోగులంతా ఇప్పటికే  అమరావతిలో స్థిరపడ్డారని, కొందరు ప్లాట్లు కొనుగోలుచేశారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇంతజరుగుతుంటే, ఎన్జీవోసంఘం నేతలైన చంద్రశేఖర్‌ రెడ్డి, బొప్పరాజు ఇతరనేతలు, ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. 

నేరం చేసినవాడే నేరస్తుడుకాడని, దాన్నిచూస్తూ ఉన్నవారుకూడా నేరస్తులేననే విషయాన్ని ఉద్యోగులు గ్రహించాలన్నారు. తమబిడ్డల భవిష్యత్‌తో పాటు రాష్ట్రప్రజల జీవితాలను గురించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ఎన్జీవోలు, ఆలోచించాలని, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని, రాజకీయాలకు, సంఘాలకు అతీతంగా గళమెత్తాలని చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు కనకమేడల విజ్ఞప్తి చేశారు. జగన్‌ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా రాజధాని నిర్మాణానికి తమవంతుగా వారంతా సహకరించాలన్నారు.