గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల పేరుతో నవ్యాంధ్ర  ప్రజల మనోభావాలను, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణను అపహాస్యం చేశారని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బి. చెంగల్రాయలు మండిపడ్డారు. తండ్రివైఎస్‌ఆర్ విద్రోహదినం చేస్తే ఇప్పుడు కొడుకేమో అవతరణ దినోత్సవం నిర్వహిస్తున్నాడని ఎద్దేవా చేశారు.  ప్రజలుకష్టాల్లో ఉంటే, వారోత్సవాలు, దినోత్సవాలు జరుపుతారా?  అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

శుక్రవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మద్రాస్‌ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎలా ఏర్పడిందో, దానికి కారకులైన వారెవరో కూడా తెలుసుకో కుండా కేవలం కేసీఆర్‌ మెప్పుకోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 1న రాష్ట్రావతరణ దినోత్స వాన్ని నిర్వహించిందని ఆరోపించారు.

అక్టోబర్‌ 18,1952న పొట్టి శ్రీరాములు మద్రాస్‌లో ఆమరణ నిరాహారదీక్షకు కూర్చొని దాదాపు 58రోజులు దీక్షచేసి చివరకు డిసెంబర్‌15న ఆయన చనిపోయారని గుర్తుచేశారు. ఇది జరిగాక ఆనాటి  ప్రతిపక్షనేత శ్యామ్‌ప్రసాద్‌ముఖర్జీ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న ఆందోళనను, పొట్టి శ్రీరాములు మరణాన్ని ప్రధాని నెహ్రూ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అనంతరం అక్టోబర్‌ 1వ తేదీ 1953న  మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయి 11జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందన్నారు. 

read more కలానికి కులాన్ని ఆపాదించిందెవరో... చర్చకు సిద్ధమా?: కళా వెంకట్రావు సవాల్

ఇదిలా ఉంటే 1997లో జగన్మోహన్‌రెడ్డి తండ్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నవంబర్‌ 1ని విద్రోహదినంగా పాటించాడని గుర్తుచేశారు. ఆనాడు ఆయన మాట్లాడుతూ...రాష్ట్రం ఏర్పడిన సమయంలో మనకు రావాల్సిన మద్రాస్‌, బళ్లారి, తిరుత్తణి ప్రాంతాలు మనకు రానందున నవంబర్‌ 1ని విద్రోహదినంగా పాటిస్తున్నట్లు చెప్పడం జరిగిందన్నారు. 

ఇలా తండ్రి నవంబర్‌ 1ని విద్రోహదినంగా పాటిస్తే కొడుకు జగన్మోహన్‌రెడ్డి అదేరోజుని రాష్ట్రావతరణ దినంగా పాటించడం ఎంతవరకు సబబో సమాధానం చెప్పాలని చెంగల్రాయలు డిమాండ్‌ చేశారు.  ఏ మహానుభావుడైతే రాష్ట్ర ఏర్పాటు కోసం తనజీవితాన్ని త్యాగం చేశాడో ఆయన ఫొటో లేకుండా రాష్ట్రప్రభుత్వం అవతరణ దినోత్సవ ఆహ్వాన పత్రికను ప్రచురించడం దారుణమని టీడీపీ నేత వ్యాఖ్యానించారు. 

ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది 1953 నవంబర్‌ 1న అయితే 1956లో 8జిల్లాలున్న తెలంగాణ ప్రాంతం జతకూడిందన్నారు.  తరువాత ఆంధ్రాలో 2జిల్లాలు, తెలంగాణలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయన్నారు. మొత్తం 23జిల్లాలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందన్నారు. 

తరువాత తెలంగాణ ప్రాంతాన్ని వేరుచేసే క్రమంలో జూన్‌2న రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారని దానికి కొనసాగింపుగా, గత ఐదేళ్లుగా అదేరోజున నవ నిర్మాణదీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. కట్టుబట్టలతో కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్ర ప్రదేశ్‌సాక్షిగా జూన్‌2న  తెలుగుదేశం పార్టీ, కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. 

 read more  క్వారీ కోసమే సామాన్యులపై కేసులు...: వైసిపి ఎమ్మెల్యేపై కాల్వ శ్రీనివాసులు ఆరోపణ

రాష్ట్రాన్ని ముక్కలుచేసిన  కేసీఆర్‌ డైరెక్షన్‌లో నవంబర్‌1ని రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జగన్‌సర్కారు నిర్వహించడం దారుణమన్నారు. ఇసుకవారోత్సవాలు, అర్థంపర్థంలేని అవతరణ దినోత్సవాలతో రాష్ట్ర ప్రజల్ని వైసీపీ ప్రభుత్వం ఎక్కువకాలం మభ్యపెట్టలేదన్నారు. ప్రజలు ఆనందంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పండుగలు నిర్వహించాలని, కానీ జనంబాధల్లో ఉంటే ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని చెంగల్రాయలు నిలదీశారు. 

దోమలబెడదతో రాష్ట్రప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి రోగాలబారిన పడుతుంటే జగన్ సర్కారులో స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ప్రకటనల పేరుతో  తనకు సంబంధించిన మీడియా సంస్థలను బాగుచేయడానికే ముఖ్యమంత్రి జగన్‌ ఆర్థికపరిస్థితులను కూడా లెక్కచేయకుండా హంగు, అర్భాటాలతో అవతరణ దినోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నాడని చెంగల్రాయలు ప్రశ్నించారు.