Asianet News TeluguAsianet News Telugu

ఎక్కడ బాబుపై కోడిగుడ్లు పడ్డాయో.. అక్కడే వైసీపీకి సత్కారం చేస్తాం: అశోక్ బాబు

ఎక్కడైతే చంద్రబాబుపై కోడిగుడ్లు, చెప్పులు పడ్డాయో, అక్కడే వైసీపీనేతలకు ప్రజలతో తగిన సత్కారం చేయిస్తామన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. 

tdp mlc ashok babu slams minister avanthi srinivas
Author
Mangalagiri, First Published Feb 28, 2020, 6:14 PM IST

ఎక్కడైతే చంద్రబాబుపై కోడిగుడ్లు, చెప్పులు పడ్డాయో, అక్కడే వైసీపీనేతలకు ప్రజలతో తగిన సత్కారం చేయిస్తామన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన అశోక్ బాబు.. మంత్రి అవంతిపై విరుచుకుపడ్డారు.

విశాఖలో పోలీసులు చట్టప్రకారమే పనిచేశారని, వారే చంద్రబాబుకి రక్షణ కల్పించారని చెబుతున్న మంత్రి.. గతంలో అదే పోలీసుల పనితీరు గురించి జగన్ అన్నమాటలన గుర్తు చేసుకుంటే మంచిదన్నారు.

కోడికత్తి ఘటన జరిగినప్పుడు ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ, హైదరాబాద్ వెళ్లి జగన్ కేసు పెట్టారని అశోక్ బాబు గుర్తుచేశారు. ఆనాడు చట్టప్రకారం పనిచేసిన పోలీసులను పట్టుకొని “నేను అధికారంలోకి వస్తే మీసంగతి తేలుస్తాను” అంటూ బెదిరించిన విషయం రాష్ట్ర ప్రజలెవ్వరూ మరచిపోలేదన్నారు.

Aslo Read:ప్రజలు అడ్డుకొంటే మేమెలా బాధ్యులం: స్పీకర్ తమ్మినేని సీతారాం

ఆనాడు తెలుగుదేశంలో ఉన్న అవంతి, జగన్ చర్యపై ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదని పరుచూరి ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో పోలీసులు చట్టప్రకారమే పనిచేస్తుంటే, కారణాలు లేకుండా వారిని వీఆర్ కు ఎందుకు పంపుతున్నారో అవంతి చెప్పాలని డిమాండ్ చేశారు.

200 మంది రక్షకభటులకు జీతాలు ఇవ్వకుండా వెయిటింగ్ లో ఎందుకుపెట్టారో, కోడికత్తి కేసు విచారణను ఏంచేశారనే దానికి జగన్ ఎందుకు సమాధానం చెప్పడంలేదో అవంతి చెప్పాలన్నారు. చంద్రబాబుని అడ్డుకున్న వారంతా కచ్చితంగా వైసీపీవారే నని, వారికి కట్టడిచేయడానికి ఒక ఎస్సై, 10, 15 మంది కానిస్టేబుళ్లు సరిపోయేవారని అశోక్ తెలిపారు.

కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసురుతుంటే, గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తుంటే, మాజీ ముఖ్యమంత్రి వాహనశ్రేణిపైకి చొచ్చుకొస్తుంటే చోద్యం చూడటం రక్షణ కల్పించడమవుతుందా అని అశోక్ బాబు నిలదీశారు.

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖలో పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుండగా, ఎటువంటి అనుమతులు లేకుండా కొవ్వొత్తుల ర్యాలీని తలపెట్టాడని అశోక్ గుర్తుచేశారు. ఆనాడు ఆయన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డగించలేదని, పోలీసులే వెనక్కు పంపించడం జరిగిందన్నారు.

Also Read:విశాఖ వివాదం: చంద్రబాబుపై విరుచుకుపడ్డ పోలీసు అధికారుల సంఘం

నేడు చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతులిచ్చారని, ఆయన్ని నిర్బంధించాలనే దురుద్దేశంతో, కావాలనే అనుమతులు ఇచ్చినట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. విశాఖ ప్రజలు జగన్ ను నమ్మడం లేదని, ఆయన ప్రభుత్వం వచ్చినా తమకు ఏమీ చేయదని వారు నమ్మబట్టే, అక్కడ టీడీపీని గెలిపించారని అశోక్ బాబు తెలిపారు.

వైసీపీ నేతల పైశాచిక ఆనందం తాత్కాలికమేనని, వచ్చేవారమే విశాఖలో చంద్రబాబు పర్యటిస్తారని ఆయన స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా వారు సాగిస్తున్న భూకబ్జాలు, దోపిడీలు, దందాలను సాక్ష్యాలతో సహా కోర్టులకు తెలియచేస్తామన్నారు.

విశాఖను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని, హుద్ హుద్ వచ్చినప్పుడు ఆయన ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేశారో, ఎంతవేగంగా నగరాన్ని పునర్నిర్మించారో దేశం మొత్తానికి తెలుసునని అశోక్ బాబు గుర్తుచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios