ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు, ముఖ్యంగా మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

రాజధాని అమరావతిలోనే కొనసాగాలని ఇచ్చాపురం నుంచి తడ వరకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నవారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

రాజధాని గ్రామాల్లో నిరసన తెలిపేందుకు టెంట్లు వేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతించడం లేదని.. అర్దరాత్రుల్లో ఇళ్లలోకి చొరబడి సంక్రాంతికి వచ్చిన బంధువుల వివరాలు చెప్పాలని సోదాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులు పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని సత్యప్రసాద్ తెలిపారు.

అధికార పార్టీ వారి ప్రదర్శనలకు అనుమతి ఇస్తూ, అమరావతి పరిరక్షణ సమితి వారికి  శాంతియుత ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడంలేదని అనగాని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి గుడికి వెళ్లే మహిళలను కూడా అడ్డుకొని పోలీసులు చితకబాదారని గుర్తుచేశారు.

మహిళలను, పిల్లలకు కూడా ఈడ్చుకువెళ్లి పోలీస్ వ్యాను ఎక్కించారని, బూటు కాళ్లతో అమానుషంగా తన్నారని సత్యప్రసాద్ మండిపడ్డారు. మహిళలను రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించారని, ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించిందని సత్యప్రసాద్ ఆరోపించారు.

రాజధాని తరలిపోతుందన్న మనస్తాపంతో 15 మంది గుండె ఆగి మరణించారని, షాపింగ్ కు వెళ్లిన మహిళలను కూడా పోలీస్ వ్యాన్ ఎక్కించారని ఆయన దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు చట్టం సెక్షన్ 144, సెక్షన్ 30 లను ప్రయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసు శాఖ మానవ హక్కుల ఉల్లంఘనపై నిష్పాక్షిక విచారణను జరిపాలని అమిత్‌షాను సత్యప్రసాద్ కోరారు.