చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి  మళ్లించేందుకు వైసిపి ప్రభుత్వ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మాజీ  మంత్రి, టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తనపై దొంగ కధనాలు ప్రచారం చేస్తున్నారని...దమ్ముంటే తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలంటూ  సీఎం జగన్మోహన్ రెడ్డికే సవాల్ విసురుతున్నానని అన్నారు.   

గతంలో కూడా జగన్, వైసిపి నాయకులు తనపై అనేక  ఆరోపణలు చేసారని... నిరూపించమంటే పారిపోయారన్నారు.  అసమర్థ పాలన పై ప్రజలకు సమాధానం చెప్పుకోలేక నాపై అసత్య ప్రచారాలు  చేస్తున్నారని అన్నారు. 

బ్లూ ఫ్రాగ్ కంపెనీ కి తనకు సంబంధం ఉందంటూ ఈసారి మరో దొంగ చాటు ప్రచారం మొదలుపెట్టారని... దమ్ముంటే నిరూపించండంటూ మరో సారి సవాల్ విసురుతున్నానని అన్నారు.  

కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 42 మంది భవన నిర్మాణ కార్మికులను హత్య చేసిన వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు మరో కుట్ర కి తెరలేపారని ఆరోపించారు. 

read more  కర్నూల్ ఇసుక సత్యాగ్రహం ర్యాలీలో ఉద్రిక్తత

 ఇంత కాలం వరద కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని...పోలీసులే అక్రమ ఇసుక రవాణాని ప్రోత్సహిస్తున్నారంటూ తలో మాటా చెప్పిన వైసిపి నేతలు ఇప్పుడు తన పై అసత్య ప్రచారాలకు తెర లేపారని అన్నారు. వైసిపి ఇసుకాసురులు అడ్డంగా దొరికోపోయారని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా, దాని వెనుకున్న నేతల జాతకాలు టిడిపి బయటపెట్టడం తో ప్రభుత్వం మరో కొత్త నాటకం మొదలు పెట్టిందన్నారు.

5 నెలలుగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్ల పాలు చేసి 42 మందిని ఈ ప్రభుత్వం, వైసిపి ఇసుకాసురులు బలి తీసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు చేసిన తప్పులు బయటపడి ప్రజలు మొహన ఉమ్మి వేసే పరిస్థితి రావడంతో మరో సారి కట్టు కథ రెడీ చేసిందని ఆరోపించారు. 

గతంలోనే జగన్ నాపై అనేక ఆరోపణలు చేసారన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలల అయినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేక ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసారని  ఆరోపించారు. విశాఖ లో బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ పై సిఐడి దాడులు, లోకేష్ కి అత్యంత సన్నిహితుడు కంపెనీ అంటూ మరో అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. 

read more  చంద్రబాబు దీక్షను భగ్నం చేసేందుకే కుట్రలు... పార్థసారథిపై అనురాధ కౌంటర్లు

తాను గతంలో అనేక సార్లు జగన్ గారికి నేరుగా సవాల్ చేసానని గుర్తుచేశారు. ఇప్పుడు మరోసారి సవాల్ విసురుతున్నా... జగన్ చెత్త మీడియా కి కూడా నేరుగా సవాల్ చేస్తున్నా... దొంగ చాటుగా అసత్య వార్తలు ప్రచారం చేసి ఆనంద పడటం మానుకోవాలన్నారు. దమ్ముంటే తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. 

.బ్లూ ఫ్రాగ్ కంపెనీ కి తనకు ఎటువంటి సంబంధం లేదని... ఆ కంపెనీకి సంబంధాలు ఉన్నట్టు అసత్య వార్తలు సృష్టించిన వారిపైనా,సోషల్ మీడియాలో ఒక కుట్ర ప్రకారం నాపై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానాని  లోకేశ్ హెచ్చరించారు.