అవినీతి చక్రవర్తి జగన్‌ పాలనలో రాష్ట్రమంతా అవినీతిమయంగానే మారిందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు  కేఎస్ జవహర్ ఆరోపించారు. విశాఖలో ఏసీబీ అధికారుల కంటే దారిదోపిడీ దొంగలే నయం అని రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వ్యాఖ్యానించడం ముఖ్యమంత్రి అవినీతి పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. 

అవినీతి పరుల పాలనలో ఉన్నాం కాబట్టి వ్యవస్థలన్నీ అవినీతిమయంగా అవుతున్నాయన్నారు. ఏసీబీలో అవినీతి ఉందని స్వయంగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోసే ఒప్పుకున్నారని తెలిపారు. 

జగన్‌ పాలన జే టాక్స్‌ మయంగా ఉందని  ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోందన్నారు. గతంలో అక్రమ కేసులు పెట్టిన కొంత మంది పోలీసులను విమర్శిస్తే మొత్తం పోలీస్‌ వ్యవస్థనే అవమానించినట్లుగా దళిత నేత వర్ల రామయ్యపై విరుచుకుపడ్డవారు ఇప్పుడు ఎందుకు స్పందించడంలేదన్నారు. ముఖ్యంగా  తొడలు కొట్టి, మీసాలు తిప్పిన పోలీసు అధికారుల సంఘం నేత శ్రీనివాస్‌ ఇప్పుడెమయ్యారని ఎద్దేవా చేశారు. 

READ MORE  ఏసిబి అధికారులా.... దారి దోపిడీ దొంగలా...: పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్

ఆ సంఘటన మరువక ముందే ఏసీబీ పోలీసు అధికారుల విషయంలో దారిదోపిడీ దొంగలే నయం అని సాక్షాత్తూ మంత్రి వ్యాఖ్యానించడం పట్ల పోలీసుల సంఘం నేత మీసాలు తిప్పుతారా? తొడలు కొడతారా? అని ప్రశ్నించారు. జగన్‌ అనుభవలేమి, అసమర్థతతో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోతున్నాయన్నారు.   అవినీతిపరుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమని జవహార్ మండిపడ్డారు.   

 కొందరు ఏసీబీ అధికారులు దారి దోపిడీ దొంగల్లా తయారయ్యారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అవినీతిని అరికట్టే వారే లంచాలకు అలవాటుపడి అడ్డదారులు తొక్కడం దారుణమని.. ప్రస్తుత ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందని మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ఇప్పటికే ఈ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ డీజీ,హోం మంత్రితోనూ మాట్లాడినట్లు తెలిపారు. పలు కేసుల్లో విచారణే అవసరం లేకుండా పూర్తి సాక్ష్యాధారాలున్నా ఏసిబి అధికారులు పట్టించుకోకుండా నిందితులతో బేరసారాలు జరుపుతున్నట్లు ఆరోపించారు. కాబట్టి తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. ఏసీబీ అధికారులపై కూడా అలాగే కేసులు పెట్టాలని సూచించారు.

read more  ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి: సోమిరెడ్డి

తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా సస్పెండ్ చేయాలన్నారు.లంచాలు ఇవ్వని అధికారులపై తప్పుడు కేసులు బనాయిస్తారా..? అని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ నుంచి డైరెక్టుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే... మా శాఖకు చెందిన కొందరు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అన్నారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.