గుంటూరు: పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమాన్ని వైసిపి ప్రభుత్వం చేపట్టిందని... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవమాసాల, నవ మోసాల పరిపాలనకు ఇది మరో ఉదాహరణ మాత్రమేనని  మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. పేదవాడు కాపురం ఉండే గుడిసెని జేసీబీతో కొట్టివేసి ఆ స్థలాన్ని ఆక్రమించి అందులో 2.5 సెంట్లు ఉంటే 1.5 సెంట్లు తిరిగి ఇస్తామంటున్నారని... ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. 

టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో గూడులేని వారికి 2.5 సెట్లు స్థలం ఇచ్చిందని.. ఇప్పుడు దాన్ని లాక్కొని 1.5 సెంట్లు ఇస్తామంటున్నారని మండిపడ్డారు. విశాఖలో 4 వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూమినేమో “బిల్డ్ ఏపీ” పేరుతో తక్కువ ధరకు తమ వారికే అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అలాగే ఎస్టీ,ఎస్సీ, మైనార్టీలు సాగు చేసుకుంటున్న 10వేల ఎకరాలు లాక్కొని ఇళ్ల స్థలాలు ఇస్తారట అని ఎద్దేవా చేశారు. 

read more  యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడులే జగన్ టార్గెట్... అందుకోసమే...: వర్ల రామయ్య

ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు ప్రజలు జగన్ ను గెలిపించారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను, పాఠశాలల క్రీడా మైదానాలను, రైతులు సాగుచేసుకుంటున్న భూములను, గత ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇళ్లను కూల్చేసి మరీ లాక్కుంటున్నారని అన్నారు.  చెరువులు, కుంటలు, కళ్ళాల భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. 

రాజమండ్రిలోని తెలుగు విశ్యవిద్యాలయంకు చెందిన 20 ఎకరాల భూమిని కూడా వెనక్కు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయని  గుర్తుచేశారు. ప్రభుత్వం ఎలా అయినా భూమిని సేకరించాలని, వాళ్ల టార్గెట్ ను ఉగాధిలోపు పూర్తిచేయాలని పేద ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నారని... ఇది మంచి పద్దతి కాదన్నారు.

అమరావతిలో ఈ ప్రభుత్వ భూకబ్జాలను అడ్డుకున్న వారిపై దాదాపు 426 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు 70 సంవత్సరాలు పేదల స్వాదీనంలో ఉన్న భూములను కూడా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే అతలాకుతలం అయిపోయిందని అన్నారు.

read more  ఏపికి మహిళా ముఖ్యమంత్రి... ప్రచారం చేయిస్తున్నదే జగన్... ఎందుకంటే...: దేవినేని ఉమ

ప్రభుత్వ భూములను పంచిపెడతే దానిలో అర్ధం ఉందా అని ప్రశ్నించారు. పేదవాళ్ల పొట్టగొట్టి పేదవాళ్లకే పంచిపెడుతానంటున్నాడు ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్ అని విమర్శించారు. పేద ప్రజల భూములను సైతం “హైవే రాబరీ” గా లాక్కుంటున్నారని.... ఇది ప్రభుత్వ కబ్జా కాదా? అని అడిగారు. ఈ ముఖ్యమంత్రి ఇప్పటికే రాష్ట్రాన్ని ప్రాంతాలు, మతాలు, కులాలుగా విడగొట్టి పాలిస్తున్నాడని... ఇప్పుడు అమరావతి రైతులకు, భూమిలేని పేదవారికి మద్యలో చిచ్చుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. 

భూములను అమ్ముకోవడానికి బిల్డ్ ఏపీని తీసుకొచ్చాడని...ఇది నిజానికి కిల్డ్ ఏపీ అన్నారు.. ఇడుపులపాయ ఎస్టేట్ లో ఉన్న వందల ఎకరాలను జగన్ పేదలకు పంచగలడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో పది లక్షలు కట్టించి ఇచ్చారని... ఇంకా పది లక్షలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఒక్క అమరావతిలోనే 5024 ఇళ్లు కట్టి ఉన్నాయని..... వాటిని పేదలకు ఇవ్వవచ్చు గదా అని అన్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు పంచడం మానేసి పేదలకు ఇళ్ల పేరుతో మోసం చేస్తున్నారని జవహర్ వెల్లడించారు.