నవశకం సర్వే లబ్దిదారుల ఎంపికకు కాదు...అందుకోసమే: జవహర్
ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల చేత వివిధ ప్రభుత్వ పథకాల కోసం లబ్దిదారులను గుర్తించే సర్వే చేస్తున్న విషయం తెలిసిందేే. ఈ సర్వేపై మాజీ మంత్రి జవహార్ సంచలన ఆరోపణలు చేశారు.
గుంటూరు: రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేయనున్న పది సంక్షేమ పథకాల అమలుకు లభ్దిదారులను గుర్తించడం అటుంచి ఉన్న లబ్ది దారులను అనర్హులుగా నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు జవహర్ మండిపడ్డారు.
ఈ మేరకు బుధవారం తన కార్యాలయం నుంచి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. గ్రామాల్లో,వార్డుల్లో వాలంటరీలు చేస్తున్న సర్వే ఆంతర్గతంగా లభ్దిదారుల కుదింపుకేనని స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రధానంగా పింఛన్లు తొలగింపు, రేషన్ కార్డుకు తొలగింపుకు తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
పదివేలు దాటి ఆదాయం కలిగిన వారందరికీ రేషన్ కార్డులు తొలగించాలని చెప్పటంతో అంగన్వాడీ ఉద్యోగులు ఆర్ధికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కుటుంబం ఆదాయం అనేది ప్రాతిపదికన తీసుకోకూడదని తెలియలేదా అని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ ద్వారా సామాన్య ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందని జవహర్ అగ్రహించారు.
చంద్రబాబు నాయుడు ఆలోచనలు, అనుభవాల ద్వారా పుట్టిన అమరావతిని ముడుముక్కలు చేయాలని వైసిపి ప్రభుత్వం భావించడం దారుణమన్నారు. అలా చేయాలని చూస్తే ఐదుకోట్ల మంది ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వైసిపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు జవహార్ హెచ్చరించారు.