అమరావతి: అధికారంలోకి వచ్చి నిండా 5 నెలలు పూర్తికాకుండానే రాష్ట్ర ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆగ్రహం వ్యక్త్యం చేశారు. మంగళవారం ఆయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పల్లా శ్రీనివాసులుతో కలిసి గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతప్రభుత్వం ఇసుక సరఫరాను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి, అవినీతికి పాల్పడిందని  వైఎస్సార్‌సిపి నాయకులు అప్పట్లో ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం కొత్త ఇసుక విధానంతో ప్రజలకు ఎంతమేరకు మేలుచేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

నూతన ఇసుక విధానం పేరుతో 30లక్షల మంది నిర్మాణరంగ కార్మికుల జీవనాన్ని,125రకాల వృత్తులను నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేసి, తక్కువధరకు ప్రజలకు ఇసుకను అందిస్తామంటూ సెప్టెంబర్‌ 05వ తేదీన కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్‌రెడ్డి సర్కారు, నేటికీ ఇసుకసమస్యను తీర్చలేకపోయిందని ఆలపాటి ఎద్దేవా చేశారు. 

వైసీపీ తీసుకొచ్చిన ఇసుకవిధానం ద్వారా  ప్రజలకు ఏవిధమైన ప్రయోజనం కలగకపోగా, రాష్ట్రంలో కొత్తగా ఇసుక  మాఫియా పుట్టుకొచ్చిందన్నారు. ఇసుక విధానం వల్ల వైసీపీ నేతలే లబ్ధిపొందుతున్నారని, ఇసుకద్వారా వచ్చే ఆదాయాన్ని పంచుకోవడంలో వారిమధ్య తలెత్తే, అభిప్రాయబేధాలను స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే పరిష్కరిస్తున్నారని మాజీమంత్రి  ఆక్షేపించారు. 

ఇసుక కొరత వరదలవల్ల ఉత్పన్నంకాలేదని, ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో కృత్రిమ కొరత ఏర్పడిందన్నారు. ఒకవైపు ఇసుక లేదంటూనే పక్కరాష్ట్రాలకు వేల లారీలు అక్రమరవాణా అవుతున్నా ప్రభుత్వంలో చలనంలేదన్నారు. 

Read more బ్రాహ్మణుల దశాబ్దాల కల సాకారం...: మంత్రి వెల్లంపల్లి ...

టీడీపీ హయాంలో టైరుబండి ఇసుక ఉచితంగా లభిస్తే, ఇప్పుడు రూ.2,500లకు కొనాల్సి వస్తోందని, అలానే గతంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.1,200లకు లభ్యమైతే, వైసీపీప్రభుత్వంలో రూ.7నుంచి రూ.10వేలకు కొనాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. లారీఇసుక రూ.40 వేలనుంచి రూ.లక్ష వరకు అమ్ముతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 

ఇసుక దొరక్కండా చేసి, కృత్రిమకొరత సృష్టించి జేబులు నింపుకుంటున్న వైసీపీనేతలు, తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేశారని రాజేంద్రప్రసాద్‌ స్పష్టంచేశారు. ఇసుకకొరత కారణంగా సిమెంట్‌, నిర్మాణసామగ్రి వంటి పరిశ్రమలు మూలనపడ్డాయని, పాలనచేపట్టి ఐదునెలలు కూడా పూర్తికాకుండానే, వైసీపీ నేతలు బకాసురుల్లా ఇసుకపై పడ్డారన్నారు. 

రాష్ట్రఖజానాను ఆదాచేస్తున్నామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం, ఇసుక రవాణాకు కిలోమీటరకు రూ.1-25పైసలకు వేసిన టెండర్‌కాదని, రూ.5-25పైసల టెండర్‌ని ఎలా అంగీకరించారని ఆలపాటి నిలదీశారు. తక్కువధరకు సరఫరా చేస్తాన్న వారిని కాదని, ఎక్కువధర టెండర్‌ను వైసీపీప్రభుత్వం ఎలా అంగీకరించిందన్నారు. 

Read more జగన్ డిల్లీ పర్యటన... రాష్ట్రం కోసమా...? కేసుల కోసమా...?: టిడిపి ఎంపీ సెటైర్లు ...

30 లక్షలమంది నిర్మాణరంగ కార్మికుల భవిష్యత్‌ దృష్ట్యా, రాష్ట్రప్రభుత్వం గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్నే తిరిగి కొనసాగించాలని ఆలపాటి డిమాండ్‌ చేశారు. 

ఇసుకకొరత కారణంగా నష్టపోయిన భవననిర్మాణ కార్మికులు, వివిధరంగాల పరిశ్రమల తరుపున, ప్రభుత్వం కళ్లుతెరిపించేలా ఈనెల 25న టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. 

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయిన నిర్మాణరంగ కార్మికులకు భృతిఇవ్వాలని, ఇసుకమాఫియాను అరికట్టాలి, ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేయాలనే డిమాండ్లతో రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల వద్ద, నిరసన చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే 24న నిర్వహించాలనుకున్న కార్యక్రమాన్ని 25వ తేదీకి మార్చడం జరిగిందని ఆలపాటి వెల్లడించారు.