పెళ్లిబృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా... ఐదుగురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. చాలామంది చిన్నచిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా చుండూరు మండలం చిన్నపరిమి సమీపంలో పెళ్లిబృందంతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురయ్యింది. అదుపుతప్పి ట్రాక్టర్ తిరగబడటంతో అందులో ప్రయాణిస్తున్న పెళ్లిబృందంలో ఐదుగురు మృతిచెందారు. ట్రాక్టర్ ట్రాలీ పైనబడటంతో వీరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
read more పాదయాత్రలో ముద్దులు... పరిపాలనలో గుద్దులు ...: జగన్ పై మాజీ మంత్రి సెటైర్లు
ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాద సమయంలో వాహనంలో 50మంది వున్నట్లు సమాచారం. ఆనందంగా పెళ్లి పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణమై మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.