అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానికసంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమీషన్ సర్వం సిద్దం చేసి షెడ్యూల్ ను కూడా విడుదలచేసింది. అయితే ఈ సమయంలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో ప్రజా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించకపోవడమే మంచిదని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. 

అమరావతి పరిధిలోని 19 గ్రామాల్లో గ్రామ పంచాయితీ, ఎంపిటీసి, జడ్పిటీసి ఎన్నికలు నిలిపివేయాలని ఈసీకి సూచించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో రాజధాని అమరావతి విషయంలో కేసులు, వ్యాజ్యాలు  కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని జగన్ సర్కార్ కోరింది.

read more  ఆయనేమైనా సూపర్ ఎన్నికల కమీషనరా..?: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి మార్చి 21న తొలి విడత, మార్చి 24న రెండో విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఆ తర్వాత వెంటనే మార్చి 27న పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల రెండింటికీ కలిపి మార్చి 29న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్ ఛైర్మన్‌ పదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శ్రీకాకుళం- బీసీ (మహిళ), విజయనగరం- జనరల్, విశాఖపట్నం- ఎస్టీ(మహిళ), తూర్పుగోదావరి- ఎస్సీ (మహిళ), పశ్చిమ గోదావరి- బీసీ, కృష్ణా- జనరల్ (మహిళ), గుంటూరు- ఎస్సీ (మహిళ), ప్రకాశం- జనరల్ (మహిళ), నెల్లూరు- జనరల్ (మహిళ),  చిత్తూరు- జనరల్, కడప- జనరల్, అనంతపురం- బీసీ (మహిళ), కర్నూలు- జనరల్ అభ్యర్థులకు కేటాయించారు.