Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు జగన్ బినామీ... అందుకోసమే...: నిమ్మల సంచలన వ్యాఖ్యలు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలపై టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.  

nimmala ramanaidu  sensational comments on kcr, jagan relation
Author
Guntur, First Published Feb 4, 2020, 5:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: బినామీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న జగన్మోహన్‌రెడ్డి, ఆయన సాక్షిమీడియా తెలుగుదేశంపై ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.  5, 6 నెలలనుంచి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై జ్యుడీషియల్‌ విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని నిమ్మల ప్రశ్నించారు. 

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన ఆస్తులు, వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ బినామీలతోనే నడుపుతున్న జగన్మోహన్‌రెడ్డి ఆఖరికి రాజకీయాల్లో కూడా కేసీఆర్‌కు బినామీగా వ్యవహరిస్తున్నాడన్నారు. 

తెల్లరేషన్‌కార్డులున్న వారంతా అమరావతి చుట్టుపక్కల భూములు కొన్నారని... వారంతా తెలుగుదేశం బినామీలని దుష్ప్రచారం చేస్తూ టన్నుల కొద్దీ బురద ప్రతిపక్షంపై చల్లాలని జగన్‌ ఆయన మీడియా ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని కుటుంబాలకంటే తెల్లరేషన్‌ కార్డుదారులే ఎక్కువగా ఉన్నారని... విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి కూడా తెల్లకార్డులున్నాయని అలాంటివారు రాజధాని చుట్టుపక్కల భూములుకొంటే దాన్ని టీడీపీకి అంటగట్టడం ఎంతవరకు సబబని నిమ్మల నిలదీశారు. 

797 తెల్లకార్డులున్నవారు రాజధాని చుట్టపక్కల గ్రామాల్లో 600 ఎకరాలవరకు కొన్నారని సాక్షిమీడియాలో పేర్కొన్నారని... అలాకొనడం తప్పయినప్పుడు చర్యలు తీసుకోవడం మానేసి బురదజల్లే ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

వాన్‌పిక్‌ పేరుతో 18వేల ఎకరాలు,  లేపాక్షిపేరుతో 6వేల ఎకరాలను తన కంపెనీల్లో పెట్టుబడులుపెట్టిన వారికి అప్పనంగా ధారాదత్తం చేసిన జగన్ ఇప్పుడు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో విషప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. 

read more  ఆయనేం సృష్టికర్త కాదు... అనుకుంటాడు అంతే..: యనమలపై బొత్స సెటైర్లు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరప్షన్‌ ఆఫ్‌ ఎంపరర్‌ పేరుతో పుస్తకాలు ముద్రించి, రాజధాని భూముల్లో 24వేల ఎకరాలు దోచేశారని విష ప్రచారం చేశారని గుర్తుచేశారు. ... అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 4వేల ఎకరాలని చెప్పారని అన్నారని... ఇప్పుడేమో సాక్షిలో 600 ఎకరాలంటూ కొత్తకథలు చెబుతున్నారని కానీ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ వివరాలు పరిశీలిస్తే గత 5ఏళ్లలో కేవలం 125ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్స్‌ జరిగినట్లు స్పష్టమైందన్నారు. 

అవినీతి అనేది వెలికితీసే కొద్దీ పెరగాలి కానీ తగ్గడం చూస్తుంటే ఎవరికైనా అది తప్పుడు ప్రచారమనే అనుమానమే కలుగుతుందన్నారు. రాత్రికి రాత్రి సూట్‌కేసు కంపెనీలు సృష్టించి  వాటి ద్వారావచ్చిన సొమ్ముతో రూ.10ల విలువైన షేర్లను వందలు, వేలకు అమ్ముకున్న జగన్‌ కంపెనీలైన భారతి సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌ వంటివే నిజమైన బినామీ కంపెనీలని నిమ్మల మండిపడ్డారు. 

జగన్‌ తాత రాజారెడ్డి 1200 ఎకరాల అసైన్డ్‌ల్యాండ్‌ని ఆక్రమించుకుంటే, ఆ వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం బయటపెట్టడంతో  వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి  అసెంబ్లీలో మాట్లాడుతూ, ''ఏదో తెలియక కొన్నాము.. 631ఎకరాలు వెనక్కు ఇచ్చేస్తాము'' అని చెప్పింది వాస్తవం కాదా అని టీడీపీ ఎమ్మెల్యే నిగ్గదీశారు. 

క్విడ్‌ప్రో, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేపదాలకు జగనే బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నారు. అమరావతి ప్రాంతలోని రైతులు,  అసైన్డ్‌ భూములను అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని కోరినందునే చంద్రబాబు  ఆనాడు భూములమ్ముకునే హక్కును కల్పించారన్నారు. అమరావతిని చంపేశాక అసైన్డ్‌  భూములకు కూడా కమర్షియల్‌ ప్లాట్లు ఇస్తానని చెబుతున్న జగన్‌  ఎంతభూమిచ్చినా రైతులకు ఉపయోగం ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు.

ఇళ్లస్థలాల కోసం రైతుల స్వాధీనంలోని భూముల్ని లాక్కుంటున్నారు..

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడంకోసం, 70, 80ఏళ్ల నుంచి రైతులు సాగుచేసుకుంటున్న, వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుంటున్న కుంటలు, పుంతలు, లింకురోడ్లు, కల్లాలు, పోరంబోకు, పట్టాభూముల్ని జగన్‌ సర్కారు లాక్కుంటోందన్నారు. ఎక్కడో ఊరికి దూరంగా ఉండే ఇలాంటి భూముల్ని అటు రైతులకు కాకుండా చేసి ఇళ్లస్థలాల పేరుతో పేదలకు అప్పగించినా ఎంతవరకు ఉపయోగపడతాయో ఆలోచించాలన్నారు.  

read more  4లక్షల 27 వేల పెన్షన్లు తొలగించాం... నారావారిపల్లెలో కూడా...: మంత్రి పెద్దిరెడ్డి

కుంటలు, పుంతలు, కల్లాలుగా ఉన్న 20, 30, 40సెంట్లభూమిని కేవలం 10, 15 కుటుంబాలకు ఇచ్చినా, ఆభూములన్నీ ఊళ్లకు కిలోమీటర్లపైబడి దూరంగా ఉన్నాయని, వాటిలో ఆయా కుటుంబాలు నివాసమెలా ఉంటాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అలాదూరంగా ఉన్న స్థలాలకు విద్యుత్‌ సౌకర్యం, నీటివసతి, రవాణా వసతి కల్పించడానికి ప్రభుత్వానికి అదనపు భారమవుతుందన్నారు. 

జగన్‌ సర్కారుకు నిజంగా పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధే ఉంటే ఊళ్లకు పక్కనే ఉండే భూములను ల్యాండ్‌ అక్విజేషన్‌ పద్ధతిలో తీసుకొని అన్ని రకాలుగా ఒకకాలనీగా అభివృద్ధిచేసి స్థలపంపిణీ చేస్తే బాగుంటుందని నిమ్మల హితవు పలికారు. 

ప్రజాసేవకులుగా ఉండాల్సిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రభుత్వానికి వత్తాసు పలకడం మంచిపద్ధతి కాదన్నారు. మాజీమంత్రి కేఎస్‌ జవహర్‌పై 7,8 సెక్షన్లుపెట్టి, తప్పుడుకేసులు మోపి,  గృహనిర్బంధంలో ఉంచారని నిమ్మల మండిపడ్డారు. ర్యాలీచేయడమే జవహర్‌ చేసిన నేరమైతే, వైసీపీవారు చేస్తున్న ర్యాలీలపై ఏంసమాధానం చెబుతారని, వారిని ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి చిక్కుల్లో పడవద్దని రామానాయుడు సూచించారు.    

Follow Us:
Download App:
  • android
  • ios