ఇసుక కొరత విషయంలో ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వం మంచి చర్యలు తీసుకున్నా...వరదల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. దీంతో ఇసుక కొరత రోజు రోజుకు మరింత ఎక్కువవుతోందని... ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసని నాని వెల్లడించారు. 

 ఇసుక కొరత వల్ల లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేకుండా ఇబ్బంది పడుతున్నారనేది తమ దృష్టిలో కూడా వుందన్నారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే ప్రభుత్వం కూడా ఏమైనా చేయడానికి వీలుంటుంది. అప్పటివరకు ఈ కొరత ఇలాగే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం అమరావతిలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు, ఆమోదం తెలిపిన అంశాల గురించి మంత్రి పేర్నినాని మీడియాకు వెల్లడించారు. 

ప్రతి ఏటా చేనేత కార్మికుడికి రూ.24 వేలు ఆర్ధిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 21న నేతన్నల ఖాతాలోకి డబ్బు జమ అవుతుందని మంత్రి మీడియాకు తెలిపారు. ఒకే విడతగా రూ.24 వేలు చేనేతకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని..  ఈ పథకం ద్వారా సుమారు 90 వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని మంత్రి వెల్లడించారు.మగ్గం ఉన్న నేత కార్మికుల్ని గుర్తించేందుకు సర్వే చేపట్టనున్నారు. 

అలాగే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10 వేల ఆర్ధిక సాయాన్ని అందించాలని కేబినెట్ నిర్ణయించిందని.. బోటు ఉన్న కుటుంబాలతో పాటు తెప్పలపై వేటకు వెళ్లే కుటుంబాలకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్ని నాని పేర్కొన్నారు.దీనితో పాటు మత్స్యకారుల బోట్లకు వినియోగించే డీజిల్‌పై సబ్సిడీ పెంచుతున్నామని దీని ప్రకారం ప్రతి లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ అందిస్తామన్నారు. 

అందరికీ సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని.. ప్రతి కుటుంబానికి 105 నుంచి 110 లీటర్ల మంచినీరు అందిస్తామని మంత్రి తెలిపారు.మధ్యాహ్న భోజనం వండే వాలంటీర్ల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతున్నామని.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి జీతం అందేలా కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా జీతం డిపాజిట్ చేస్తామని తెలిపారు. 

పలాసలో 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో నియామకాలకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని నాని చెప్పారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వాళ్లకు రూ.3 వేల గౌరవ వేతనం అందిస్తామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పోరేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులను గుర్తిస్తామని మంత్రి తెలిపారు.ప్రభుత్వమే హామీగా ఉండి వాహనాలు అందజేసేలా పథకం రూపకల్పన చేస్తామన్నారు. 

1000 కోట్లతో ఏపీఎస్‌ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. పొగాకు బోర్డు తరహాలో చిరుధాన్యాలు, అపరాల బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్నినాని వెల్లడించారు.