Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ ఎక్కడినుండయినా పాలించవచ్చు..: మంత్రి పెద్దిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ ఇవాళ(బుధవారం) తీసుకున్న నిర్ణయాలతో గ్రామ పంచాయితీల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెెల్లడించారు. 

Minister Peddireddy Ramachandra Reddy comments on AP Cabinet Decisions
Author
Amaravathi, First Published Feb 12, 2020, 6:22 PM IST

అమరావతి:  అభివృద్థి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ న్యాయం చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో  రాజధాని విశాఖపట్నం కు వెళ్లడం ఖాయమన్నారు. అభివృద్థి వికేంద్రీకరణ కు చంద్రబాబు అడ్డంకులు కల్పిస్తున్నారని...సీఎం ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయవచ్చన్నారు. సీఎం  జగన్ మూడు రాజధానులు చేస్తారనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు వుందని పెద్దిరెడ్డి అన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పాలనను ప్రజల సమస్యలు, ఆకాంక్షలు తెలిసిన నాయకులకే అప్పగించాలని వైసిపి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. కేవలం డబ్బు వుందని కొందరు ప్రతిష్ట కోసం స్థానిక సంస్థల పదవులకు పోటీ చేస్తున్నారని.... అలా గెలిచిన తర్వాత  వారు ఆ ఊరిని, ఆ వార్డును, ఆ మున్సిపాలిటీని, ఆ డివిజన్ ను పట్టించుకోకుండా వేరే ప్రాంతాల్లో నివాసం వుంటున్నారని అన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే ఇవాళ(బుధవారం) జరిగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్న నాయకులపై ప్రభుత్వమే చర్యలు తీసుకునే ఏర్పాటు చేస్తున్నామన్నారు. గెలిపించిన నాయకులు అందుబాటులో లేకపోవడంతో స్థానికంగా ఏ సమస్య వచ్చినా ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం వుందన్నారు. అందుకని ఈ మౌలికమైన అంశాన్ని పరిశీలించిన వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని.. మంత్రివర్గంలో కూడా ఈ అంశాలను క్షుణ్ణంగా చర్చించి వాటికి ఆమోదం కూడా తెలిపామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. 

ప్రజల పట్ల బాధ్యత, వారి సమస్యల పట్ల అవగాహన, గ్రామస్థాయిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ వారి కష్టాలను, సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తులకు పెద్దపీట వేయాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. అలాంటి నిజాయితీపరులు, ప్రజల కోసం పరితపించే వారే ప్రజలకు ప్రతినిధులుగా వుండాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. 

read more  ఆ విషయంలో కుప్పం ప్రజల మద్దతు మాకే... తీర్మానం కూడా...: ఆదిమూలపు సురేష్

ఈరోజుల్లో సర్పంచ్ ల నుంచి, ఎంపిపిలు, ఎంపిటిసిలు, జెడ్పీటీసిలు కూడా పల్లెలకు అందుబాటులో వుండకుండా ఎక్కడో పట్టణాల్లో వుంటూ ప్రజలను పట్టించుకోని పరిస్థితిని చూస్తున్నామని అన్నారు. అలా కాకుండా స్థానికంగానే వారు నివాసం వుంటే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నామన్నారు.ఇప్పటికే ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయంను, ప్రతి యాబై కుటుంబాలకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు  చేశారు. 

''పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్ధులు మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడినట్లు రుజువైతే సదరు వ్యక్తులు గెలిచిప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగేందుకు అనర్హులుగా మారతారు. సెక్షన్ 211 ప్రకారం అక్రమ మార్గాల ద్వారా అంటే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఓటర్లను ప్రలోభపరచడం..ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయడం వంటి నేరాలకు పాల్పడితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10వేల వరకు జరిమానా వుంటుంది''  అని అన్నారు.

''పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని ప్రజాప్రతినిధుల విధినిర్వహణకు అధికారులు పూర్తిగా సహకరించాలి. సహకరించక పోయినా, అలసత్వం ప్రదర్శించినా వారిపై క్రమశిక్షణా చర్యలుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఎక్కువ రోజుల పాటు వుండటం వల్ల అభివృద్థి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి.ఈ కాలపరిమితిని సెక్షన్ 201-A(1), A(2) ద్వారా తగ్గిస్తూ తీర్మానం చేశాం'' అని మంత్రి వివరించారు.

''ఇక ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలు 18 రోజుల్లో నిర్వహించాలి. గ్రామపంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లో నిర్వహించాలి. పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్ 25 కి సవరణలు చేయడం ద్వారా గ్రామపంచాయతీ సర్పంచ్ లకు అదనపు బాధ్యతలు అప్పగించాం. పారిశుధ్య నిర్వహణ , మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ- గ్రామ సర్పంచ్ పరిధిలోకి వస్తాయి'' అని వివరించారు. 

''సర్పంచ్ పంచాయతీ పరిధిలోని గ్రామంలోనే నివసించాలి. పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావాలి.  ఇకపై గ్రామ పంచాయతీలో ప్రాదేశిక నియోజకవర్గంగా "వార్డు "ను గుర్తిస్తాం'' అని అన్నారు.

''వంద శాతం గిరిజన జనాభా వున్న పంచాయతీల్లో గ్రామ సర్పంచ్ పదవిని సెక్షన్ 15(1), (a) కింద, వార్డు సభ్యుల పదవులను సెక్షన్ 9 (1) (a) కింద అన్నింటిని గిరిజనులకే రిజర్వు చేస్తూ నిర్ణయం చేశాం. ఈ పంచాయతీలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో లేకపోయినప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని జెడ్పీటిసి స్థానాలను గిరిజనులకే రిజర్వ్ చేస్తూ ( సెక్షన్ 242D ప్రకారం) నిర్ణయించాం'' అని మంత్రి వివరించారు.

''పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6, ప్రభుత్వ ఉత్తర్వులు 791 (సాధారణ పరిపాలనా శాఖ, తేదీ 7.11.2013) ప్రకారం గ్రామసభలను నిర్వహించకపోయినా, పంచాయతీ వ్యయాల అకౌంట్ లను నిర్ణీత కాలంలో ఆడిట్ చేయించకపోయినా సదరు సర్పంచ్, ఉపసర్పంచ్ లను పదవుల నుంచి తొలగించడం జరుగుతుంది.దీనివల్ల సర్పంచ్, ఉపసర్పంచ్ లకు మరింత జవాబుదారీతనం పెరుగుతుంది'' అన్నారు.

''పంచాయతీ ఎన్నికలు అనగానే గ్రామాల్లో జరుగుతున్న హడావుడి... ప్రలోభాల పర్వం చూస్తున్నాం. ఎన్నికల తేదీ ప్రకటించినది మొదలు కేసుల కొద్ది మద్యాన్ని పల్లెలకు తరలించి ఓటర్లతొ తాగించి డబ్బు పంపిణీతో ప్రలోభాలకు గురి చేయడం జరగుతోంది. పార్టీలకు సంబంధం లేని ఎన్నికలే అయినా ఈ పదవులను ఒక ఆలంభనగా తీసుకోవడం వల్ల ప్రతిష్టకు పోయి లక్షలకు లక్షలు ఖర్చు పెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఏదో రకంగా పదవుల్లోకి రావాలనే వ్యవహారాలను చూస్తున్నారు'' అని మంత్రి మండిపడ్డారు.

read more  ఏపి కేబినెట్ సమావేశం... కీలక నిర్ణయాలివే

''ఇలాంటి పరిస్థితులకు దూరంగా చాలా ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు మెచ్చిన వ్యక్తులు... స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నిక కావాలనేది మా ఉద్దేశం. మేం ఆరాట పడుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి...మద్య నియంత్రణకు...మంచి ఆరోగ్యకర సమాజానికి... వివక్ష లేని... పార్టీలతో సంబంధం లేని... అవినీతి రహిత పాలన పూర్తిస్థాయిలో సిద్దించాలంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా అదే స్పూర్తితో నిర్వహించాలనేది అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని గతంలో 24 రోజులు వుంటే దానిని నేడు 13 నుంచి 17 రోజులకు తగ్గించాం'' అని అన్నారు.

''ఎన్నికల ప్రచార కాలపరిమితిని 5 నుంచి 7 రోజులకు పరిమితం చేశాం. స్థానికంగా వైఎస్ఆర్సిపి బలంగా వుంది. తప్పకుండా ఎన్నికల్లో తొంబై శాతం పైన మా అభ్యర్ధులు గెలుస్తారు. వైఎస్ జగన్ కేవలం రెండు పేజీల మేనిఫేస్టోను ప్రకటించారు. ఇప్పటికే ఎనబై శాతంకు పైగా హామీలను అమలు చేశాం.  నవరత్నాల్లో చెప్పిన ఇళ్ళస్థలాల పంపిణీ ఉగాది నాడు పంపిణీ చేస్తాం'' అన్నారు

''ప్రతి ఏటా ఇరవై అయిదు శాతం పక్కా గృహాలు నిర్మించి ఇస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా విజయం తధ్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఇది అద్దం పడుతుంది.  అభివృద్థి వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల్లోని ప్రజలకు వైఎస్ జగన్ న్యాయం చేస్తున్నారు.అభివృద్థి వికేంద్రీకరణ కు చంద్రబాబు అడ్డంకులు కల్పిస్తున్నారు. సీఎం ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయవచ్చు. సీఎం  జగన్ మూడు రాజధానులు చేస్తారనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు వుంది'' అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios