అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ  పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన జరపాలని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నది చరిత్రాత్మక నిర్ణయమని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఎక్కడ ప్రభుత్వానికి  ప్రజల్లో మంచిపేరు వస్తుందోనని ఓర్వలేకే ప్రతిపక్షాలు  అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 

ప్రస్తుతం ప్రతి ఉద్యోగానికి ఇంగ్లీష్‌లో ప్రావిణ్యం అనేది తప్పని సరి అయిందన్నారు. అందువల్లే నిరుపేద, గ్రామీణ విద్యార్థుల్లో ఈ ఇంగ్లిష్ నైపుణ్యాలను  పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. 

అయితే విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకూడదనే ఒకేసారి కాకుండా దశల వారీగా ఇంగ్లిష్ తరగతులను ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఎనిమిదో తరగతి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. 

read more  జగన్ ప్రభుత్వ నిర్ణయం... తెలుగు జాతికే పొంచివున్న ప్రమాదం...: టిడిపి ఎమ్మెల్సీ

ఇప్పటికే భారీ స్థాయిలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ఉన్న పరిస్థితి ప్రతిపక్షాలకు తెలీదా..? అని ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియం చదువులు ఎస్సీ, ఎస్టీలకు అందుబాటులో ఉండడం లేదన్నారు.బడుగు వర్గాలకు ఇంగ్లిష్ విద్య అందుబాటులోకి రావాల్సి ఉందని...అందుకోసం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి  వెల్లడించారు. 

పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా తమ ప్రభుత్వ నిర్ణయంతో పల్లె ప్రాంతాల్లో కూడా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. దీంతో పట్టణాల్లో పిల్లలను చదివించే స్తోమతలేని బడుగు బలహీన వర్గాలకు మేలు జరగనుందన్నారు. ఏపీలో తెలుగు మీడియం స్కూళ్లే కాదు తమిళ, ఒరియా, కన్నడ మీడియం స్కూళ్లు కూడా వున్నాయని... ఈ విషయం ప్రతిపక్షాలను తేలీదా అని మంత్రి ప్రశ్నించారు.

ఈ క్రమంలో తెలుగు భాష వికాసానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అందుకోసమే తెలుగు అకాడమిని పునరుద్ధరణ చేశామన్నారు. ఇంటర్ తరువాత ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఉండటంతో గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని...అలాంటి సమస్యను విద్యార్థులకు దూరం చేయాలన్నది తమ ప్రభుత్వం లక్ష్యాల్లో ఒకటన్నారు.

read more  ''కనెక్ట్‌ టు ఆంధ్రా'' వెబ్ పోర్టల్ ను ప్రారంభించిన సీఎం జగన్

రాజకీయాల కోసమే తెలుగు బాషకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కానీ దీన్ని వ్యతిరేకిస్తున్న నాయకులే  తమ  పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.