గుంటూరు: నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం వలసపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకొంది. డబ్బుల కోసం కన్న కూతురినే అమ్మేశాడో కసాయి తండ్రి. భార్య కళ్లుగప్పి కూతురిని లక్షా ఏబై వేల రూపాయలకు అమ్మేశాడో శాడిస్ట్. 

వివరాల్లోకి వెళితే...  ముసునూరుకు చెందిన నవీన్ బాబు, రజనీ భార్యాభర్తలు. వీరికి ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు. ఈ కారణంగా తన తల్లిదండ్రులతో కలిసి భార్య రజనీని చిత్రహింసలకు గురిచేసేవాడు భర్త. ఈ క్రమంలో ఇటీవల మరోసారి భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన నవీన్‌బాబు నాలుగో కూతురిని లక్షా 50 వేల రూపాయలకు అమ్మేశాడు. అయితే,డబ్బుల పంపిణీలో నవీన్‌బాబుకు అతని తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరగటంతో విషయం బయటపడింది. 

గాయాలపై నుంచి కోలుకున్న రజనీ తన బిడ్డ ఎక్కడనీ భర్త,అత్తమామలను నిలదీశానని... దీంతో వారంతా కలిసి మరోసారి రజనీ పై దాడి చేసి హత్యాయత్నం చేశారని తెలిపింది. వారి బారి నుంచి తప్పించుకున్న రజనీ తన తల్లి దండ్రులతో కలిసి బిడ్డ అమ్మకంపై ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అయితే న్యాయం చేస్తాడనుకున్న ముసునూరు ఎస్‌ఐ మరోలా చేశాడని...బిడ్డను కొన్న దంపతులను స్టేషన్‌కి పిలిపించి తల్లి రజనీతో ఫొటోలు తీయించి తిరిగి వారికే అప్పగించారని భాదిత మహిళ తెలిపింది. దీంతో.ఎస్ఐ తీరుపై రజనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన బిడ్డను ఇప్పించాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును గత రాత్రి ఆశ్రయించింది. ఆయన ఆదేశాలతో సోమవారం ఉదయం పోలీసులు ఐసిడిఎస్ సూపర్వైజర్  సులోచన ను తీసుకుని ముసునూరు ఎస్సై నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని సుజాత,దశరద్ ల ఇంటికి వెళ్లి వారు పెంచుకున్న పాపని వారిని చుట్టుపక్కల వారిని విచారించి స్టేషన్ కు తరలించారు. 

ఎస్ఐ రాజా రెడ్డి మాట్లాడుతూ... అమ్మాయి ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి పిల్లల పెంచుకుంటున్న తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిల్ నిర్వహించామన్నారు.  పాపని అప్పజెప్పే ప్రయత్నం చేయగా ఊపిరాడకుండా ఏడుస్తూ గుక్కపట్టడంతో పెంచుకునే వారికి అప్పచెప్పామన్నారు. నేడు ఐసిడిఎస్ అధికారులు సమక్షంలో పాపని పెంచుకుంటున్న సునితా, దశరద్ దంపతులను స్టేషన్ కు తీసుకు వచ్చామని విచారించామని... వారి వద్దనున్న పాపను రజనీ నవీన్ బాబు దంపతులకు అందజేస్తామని ఎస్ఐ తెలిపారు. "

"