ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.82 లక్షల రూపాయలకు టోకరా వేశాడో కేటుగాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కంభంపాడుకు చెందిన బసివిరెడ్డి తాను ఆర్మీలో పనిచేస్తున్నానంటూ నకిలీ గుర్తింపు కార్డు సృష్టించాడు.

ఈ క్రమంలో తాడేపల్లికి చెందిన అనుదీప్ రెడ్డి, సాంబిరరెడ్డి అనే ఇద్దరు యువకులకు సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.82 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఇద్దరి వద్ద నుంచి ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకున్నాడు.

అయితే డబ్బుతో పాటు సర్టిఫికేట్లు తీసుకుని 6 నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు అతనికి ఫోన్ చేశారు. బసివిరెడ్డి వద్ద నుంచి సరైన సమాచారం రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న బసివిరెడ్డి గొంతు కోసుకుని ఆత్మాహత్యాయత్నం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నిందితుడి వద్ద నుంచి సుమారు 60 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు బాధితులు సైతం మీడియా ముందుకు రాకపోవడం, పోలీసులు సైతం వివరాలు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.