యువతి కిడ్నాప్ యత్నం...గుంటూరు జిల్లాలో అర్థరాత్రి అలజడి
మైనర్ బాలికను కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
గుంటూరు: మైనర్ బాలికను కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ కిడ్నాప్ ప్రయత్నం నరసరావుపేట పట్టణంలో కలకలానికి కారణమయ్యింది.
వివరాల్లోకి వెళితే... నరసరావుపేట పట్టణ శివారులో శివసంజీవయ్య కాలనీలో సుకన్య అనే యువతి కుటుంబంతో కలిసి నివసిస్తోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన మహేంద్ర మరియు అతని మిత్రులు ఆదివారం రాత్రి సమయంలో కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారు. అయితే యువతి కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు తమవెంట తెచ్చుకున్న కర్రలతో దాడి చేసి అక్కడినుండి పరారయ్యారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్యాయం జరిగిన సుకన్య కుటుంబానికి న్యాయం చేయాలని... దిశ చట్టం ద్వారా దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
దిశ చట్టం మహిళలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు అవ్వట్లేదని అన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన న్యాయం జరగని పరిస్థితి దిశా పోలీస్ స్టేషన్లో కొనసాగుతుందని చదలవాడ పేర్కొన్నారు. ఈ మేరకు దిశ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు.