గుంటూరు: ఐదుకోట్ల ఆంద్రుల భవిష్యత్‌ కోసం ప్రపంచస్ధాయి రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల్ని ముఖ్యమంత్రి జగన్‌ అభినందించాల్సిందిపోయి వారిపై తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... 7 నెలలోనే వైసీపీ ప్రభుత్వం పాలనలో అన్ని విధాల విఫలమైందన్నారు. 

ముఖ్యమంత్రి జగన్‌కి ఏం చేయాలో పాలుపోక రాజధాని మార్పు పేరుతో ప్రాంతాల మద్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో విద్వంసం సృష్టిస్తున్నారన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ.. రైతులు, ప్రజలు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే వ్యవస్ధను చేతుల్లోకి తీసుకుని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

read more  అమరావతికి 1156మంది మద్దతు... మరి విశాఖకు...: టిడిపి ఎంపీ కనకమేడల వెల్లడి

పోలీసులు వ్యవస్ధల  ప్రకారం నడుచుకోవాలని సూచించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి   రైతుల చేస్తున్న ఆందోళన ప్రాంతానికి  రావటం, ఆయన కారుపై వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడటం ఇదంతా వైసీపీ  ప్రణాళిక ప్రకారమే జరిగిందని రైతులు చెప్తున్నారని తెలిపారు.  

మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఆనం రామనారాయణ రెడ్డిని అడ్డుకోని రైతులు పిన్నెల్లిని ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇందులో వైసీపీ కుట్ర కోణం స్పష్టంగా అర్దమవుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతోనే పిన్నెల్లి ఈ విధంగా వ్యవహరించారని... ఈ ఘటనలో రైతులపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు. ఈ దాడికి రైతులకు, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబందం లేదన్నారు. 

read more  వైసిపి ఎమ్మెల్యేలపై దాడి టీడీపీ గూండాల పనే : పుష్ప శ్రీవాణి

జగన్‌ ప్రజావేదికను కూల్చి విద్వంసంతో పాలన  ప్రారంభించారని అప్పటినుండి గత 7 నెలలుగా రాష్ట్రంలో విద్వస పాలన సాగుతోందన్నారు. స్వాత్యంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా రాజధానిని మార్చారా?  అని ప్రశ్నించారు.  స్వతంత్య్రానికి పూర్వం చరిత్రలో ఔరాంగాబాద్‌ నుంచి డిల్లీకి రాజధానిని మార్చిన వ్యక్తి పిచ్చి తుగ్లక్‌ ఒక్కరేనని ఇప్పుడు ఆ తుగ్లక్‌తో జగన్‌నను పోల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

వైసిపి నాయకులు రైతుల్ని రెచ్చగొట్టడం సరికాదన్నారు. గత 21 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదన్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలంటూ..ఉద్యమం చేస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ నాయకులపై కూడా  వైసీపీ నేతలు దాడులు చేస్తూ మరో వైపు ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తూ ప్రజలను భ్రయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. 

ఇది రాష్ట్ర అభివృద్దికి మంచిది కాదన్నారు. ప్రజా ఉద్యమాన్ని అధికారబలంతో అణచివేయాలకున్న వారు  చరిత్రలో కలసిపోయారని... వైసీపీ ఆ పరిస్ధితి తెచ్చుకోవద్దన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని కళా వెంకట్రావు కోరారు.