తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి దారుణహత్యపై జనగసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఆటవిక చర్యగా జనసేన భావిస్తోందని.. ఈ సంఘటన జరిగిన తీరు చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామా అని అనిపించకమానదని పవన్ ఎద్దేవా చేశారు.

ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా వుంది. ఇంత భయంకరంగా భయపెడితేనే తప్ప కలాలకు సంకెళ్లు వేయలేమని నిర్ణయానికి వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని జనసేనాని అభిప్రాయపడ్డారు.

తునికి సమీపంలోని టి.వెంకటాపురం గ్రామంలో  సత్యనారాయణ  ఇంటికి  కూతవేటు దూరంలోనే నడిరోడ్డుపై ఈ హత్యకు పాల్పడ్డారంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి వుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

సత్యనారాయణపై నెల  కిందట ఒకసారి హత్యాయత్నం జరిగి, అది పోలీసుల వరకు వెళ్లినప్పటికీ అతనికి రక్షణ కల్పించకపోవడం దారుణమని పవన్ వ్యాఖ్యానించారు. పాత్రికేయుడు సత్యనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని పవన్ తెలిపారు.

ప్రభుత్వం పక్షపాతం చూపకుండా దీని వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి  శిక్షించాలని, సత్యనారాయణ కుటుంబానికి న్యాయబద్ధమైన పరిహారాన్ని ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

పాత్రికేయుడు సత్యనారాయణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం పక్షపాతం చూపకుండా దీని వెనుక ఉన్న దోషులను చట్టం ముందు నిలబెట్టి  శిక్షించాలని, సత్యనారాయణ కుటుంబానికి న్యాయబద్ధమైన పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. 

తొండంగి అర్భన్ రిపోర్టర్ కాతా సత్యనారాయణను సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టణంలోని వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో అతన్ని ముట్టడించిన దుండగులు అందరూ చూస్తుండగానే దారుణంగా నరికిచంపారు. కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి ప్రాణాలు కోల్పోయేవరకు  దాడి చేశారు.

అతడు విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసున్నట్లు సమాచారం. అతడి ఇంటికి సమీపంలోని ఆలయంవద్ద కాపుకాసిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు